వచ్చే ఎన్నికల్లో స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు సన్ స్ట్రోక్ తప్పేట్లు లేదు. గుంటూరు జిల్లా మొత్తం మీద కోడెల శివరామకృష్ణ వ్యవహారాలపై రేగుతున్న దుమారం అంతా ఇంతా కాదు. కోడెల స్పీకర్ అయ్యింది మొదలు కొడుకు దాష్టికాలకు అంతులేకుండా పోతోందని ఒకటే గోల. కోడెల సొంత నియోజకవర్గమైన నరసరావుపేటలోనే కాకుండా ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లిలో కూడా కొడుకు బలవంతపు వసూళ్ళకు పాల్పడుతున్నట్లు గగ్గోలు పుడుతోంది. ఈ ఆరోపణలు ఎంతదాకా వెళ్లాయంటే చివరకు టిడిపి నేతలు కూడా తట్టుకోలేనంత స్ధాయికి చేరుకున్నాయి.

 

పై రెండు నియోజకవర్గాల్లో జరుగుతున్న ప్రతీ అభివృద్ధి పనిలోనూ తన పర్సంటేజ్ వసూలు చేసుకోనిదే పనులు మొదలుపెట్టనివ్వటం లేదనేది ప్రధాన ఆరోపణ. అధికారులకు టార్గెట్లు పట్టి మరీ వసూళ్ళకు పాల్పడుతున్నట్లు ప్రభుత్వ యంత్రాంగంలో కూడా చెప్పుకుంటున్నారు. ఆ మధ్య రైల్వే పనుల్లో తనకు పర్సెంటేజ్ ఇవ్వలేదని కాంట్రాక్టర్ ను అడ్డుకున్నారు. కొందరిని కిడ్నాప్ కూడా చేసారు. దాంతో విషయం కేంద్ర రైల్వేశాఖకు చేరింది. దాంతో ఢిల్లీలోని రైల్వేశాఖ ఉన్నతాధికారుల నుండి ప్రధాన కార్యదర్శికి ఏకంగా వార్నింగ్ లేఖ రావటం ప్రభుత్వంలో కలకలం రేగింది.

 

తాజాగా టిడిపి నేత, నరసరావుపేట మార్కెట్ కమిటి మాజీ ఛైర్మన్ పులిమి రామిరెడ్డి ఏకంగా  మీడియా ముందే కోడెల కుమారుని దందాల చరిత్ర విప్పటం జిల్లాలో సంచలనంగా మారింది. శిరరామకృష్ణ బలవంతపు వసూళ్ళు భరించలేని స్ధాయికి చేరుకున్నట్లు ఆరోపించారు. కొడుకు వల్లే స్పీకర్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోందన్నారు. కొడుకు దందాలకు స్పీకర్ బ్రేకులు వేయకపోతే చంద్రబాబుకు అన్నీ విషయాలు చెప్పాల్సి వస్తుందని కూడా రామిరెడ్డి హెచ్చరించటం జిల్లాలో చర్చనీయాంశమైంది. అసలు స్పీకర్ మద్దతు లేకుండానే కొడుకు అంతకు తెగిస్తాడా? ఏదో మొహమాటానికిపోయి నేతలెవరూ స్పీకర్ పై నేరుగా ఆరోపణలు చేయటంలేదంతే. అయిన నేతలు చెప్పేదాకా స్పీకర్ కొడుకు వ్యవహారాలు చంద్రబాబుకు తెలీకుండానే ఉంటాయా?