ఆంధ్రప్రదేశ్‌లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వాహనాలు నడిపితే రూ. 20 వేల జరిమానా విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా ప్రచారం సాగుతుంది. ఈ మేరకు ఆగస్టు నుంచే ఏపీ రవాణా శాఖ జరిమానాలు విధించనుందనేది ఆ ప్రచారం సారాంశం.

ఆంధ్రప్రదేశ్‌లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వాహనాలు నడిపితే రూ. 20 వేల జరిమానా విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా ప్రచారం సాగుతుంది. ఈ మేరకు ఆగస్టు నుంచే ఏపీ రవాణా శాఖ జరిమానాలు విధించనుందనేది ఆ ప్రచారం సారాంశం. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వాహనం నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయనే కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఈ ప్రచారం విస్తృతంగా సాగుతుంది. వాట్సాప్‌లో కూడా పెద్ద ఎత్తున షేర్ అవుతుంది. దీంతో వాహనాలపై ఇయర్ ఫోన్స్ పెట్టుకుని డ్రైవ్ చేసే వారిలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. కొందరైతే ప్రభుత్వంపై విమర్శలు కూడా గుప్పించారు. 

అయితే ఈ ప్రచారంపై తాజాగా ఏపీ రవాణా శాఖ కమిషనర్ స్పందించారు. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వాహనాలు నడిపితే రూ. 20 వేల జరిమానా విధించనున్నట్టుగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకే రాష్ట్రంలో సవరించిన జరిమానాలు వసూలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. నిబంధల ప్రకారం.. ఇయర్ ఫోన్ లేదా హెడ్ ఫోన్ పెట్టుకుని వాహనం నడుపుతూ పట్టుబడితే తొలిసారి రూ. 1500 నుంచి రూ. 2వేలు జరిమానా విధించనున్నట్టుగా చెప్పారు. అయితే ఇదేరకంగా పదేపదే పట్టుబడితే రూ. 10వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు.

ఈ నిబంధన ఇప్పుడు తీసుకొచ్చిందని కాదని.. చాలా కాలంగా అమలులోనే ఉందని చెప్పారు. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వాహనాలు నడిపితే విధించే జరిమానాలో ఎటువంటి పెంపు చేయడం లేదని స్పష్టం చేశారు. అటువంటి ఆలోచన కూడా లేదని అన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని రవాణా శాఖ కమిషనర్‌ కోరారు.