ఎవరు అధికారంలో ఉంటే వారికి కావాల్సిన వారికి పనులు కట్టబెడుతున్నారు. కాబట్టి పనులు ఎప్పటికీ పూర్తి కావు.

ఆంధ్రుల కలల స్వప్నం పోలవరం ప్రాజెక్టు కలలాగే మిగిలిపోతుందేమో. ప్రాజెక్టు పూర్తవ్వటానికి ఎదురవుతున్న ఆటంకాలను చూస్తుంటే పనులు ముందుకు సాగటం కష్టమనే అనిపిస్తోంది. ఇందుకు ప్రధానంగా మూడు కారణాలున్నాయి.

ఒకటిః రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి. రెండోదిః కాంట్రాక్ట్ పనులు దక్కించుకున్న సంస్ధలకు సామర్ధ్యం లేకపోవటం. మూడోదిః అంతర్రాష్ట్ర వివాదాలు పరిష్కారం కాకపోవటం.

వీటిల్లో మొదటి సమస్యను చూస్తే, ప్రాజెక్టు అంచనా వ్యయం తాజాగా రూ. 40 వేల కోట్లకు చేరుకుంది. రాష్ట్ర విభజన నేపధ్యంలో ఈ ప్రాజెక్టును అప్పటి కేంద్రప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. ఎన్డిఏ ప్రభుత్వం కూడా ప్రాజెక్టు పనులను తమకు అప్పగిస్తే పూర్తి చేస్తామని కూడా చెప్పింది.

అయితే, చంద్రబాబు ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోవటంతో గడచిన రెండున్నరేళ్ళలో ప్రాజెక్టు పనులు కేవలం 5 శాతం మాత్రం జరిగాయని అంచనా. ప్రాజెక్టు వ్యయం రూ. 40 వేల కోట్లలో కేంద్రం రూ. 16 వేల కోట్లు మాత్రమే ఇస్తానని చెప్పింది.

ఇప్పటికే ఇచ్చిన రూ. 8 వేల కోట్లను కూడా రూ. 16 వేల కోట్లలో లెక్కేసుకోమ్మనది. అంటే పెరిగిన అంచనా ప్రకారం కేంద్రం డబ్బు ఇవ్వదు, రాష్ట్రం వద్ద డబ్బు లేదు.

ఇక, కాంట్రాక్ట్ పనులు దక్కించుకున్న సంస్ధలు నిప్పు చంద్రబాబుకు బాగా కావాల్సిన వారివే. వారికెవరికీ పనులు చేసేపాటి సామర్ధ్యం లేదు. ఎందుకంటే, గడచిన రెండున్నరేళ్ళలో వారు చేసిన పనులు కేవలం 5 శాతమంటేనే ఆ సంస్ధల సామర్ధ్యం అర్ధమవుతోంది.

ప్రభుత్వాలకు పోలవరం కామధేనువు లాగ మారిపోయింది. ఎవరు అధికారంలో ఉంటే వారికి కావాల్సిన వారికి పనులు కట్టబెడుతున్నారు. కాబట్టి పనులు ఎప్పటికీ పూర్తి కావు.

మూడోది, పోలవరం ప్రాజెక్టుపై ఒడిస్సా రాష్ట్రం వేసిన కేసు సుప్రింకోర్టులో విచారణ దశలో ఉంది. న్యాయస్ధానంలో కేసు పరిష్కారం కానిదే తామేమి చేయలేమని కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ కూడా ఆ మధ్య చెప్పింది.

తాజాగా కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ద్వారా నాబార్డ్ ఇచ్చిన రూ. 1981 కోట్ల చెక్కు అయిపోయిన పనులకు రీ ఎంబర్స్ మెంట్ అని చెబుతున్నారు.

కాబట్టి భవిష్యత్తులో పెట్టబోయే ఖర్చులకు ఏ మేరకు డబ్బు అందుతుందన్నది అనుమానమే. దేశంలో నెలకొన్న కరెన్సీ సంక్షోభంలో అటు కేంద్రం వద్దా డబ్బులేక ఇటు రాష్ట్రం వద్దా డబ్బు లేకపోతే ఇక పనులు ఎలా సాగుతాయి? 2019లోగా చంద్రబాబు పోలవరాన్ని ఎలా పూర్తి చేస్తామని చెబుతున్నారు?