పవన్...ఓ అపరిచితుడే

పవన్...ఓ అపరిచితుడే

పవర్ స్టార్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ లో ఇపుడందరికీ ఓ అపరిచితుడు కనబడుతున్నాడు. ఎందుకంటే, పవన్ చేష్టలకు, మాటలకు ఏమాత్రం సంబంధం ఉండటం లేదు. రెండు రాష్ట్రాల్లోనూ అప్పుడప్పుడు పర్యటిస్తున్న పవన్ తర్వాత మీడియాతో మాట్లాడుతూ తానేం మాట్లాడుతున్నారో కూడా తెలుసుకోలేక పోతున్నారు. తాజాగా తెలంగాణా సిఎం కెసిఆర్ తో భేటీ తర్వాత మాట్లాడిన మాటలే పవన్ లోని అపరిచితుడుని అందరికీ  బహిర్గత పరిచింది.

తనకు కెసిఆర్ పాలన అంటే ఇష్టమన్నారు. అందులో తప్పు పట్టాల్సింది కూడా ఏమీ లేదు. కానీ, తెలంగాణాలో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలన్నీ ఊకుమ్మడిగా కెసిఆర్ పాలనపై  దుమ్మెత్తి పోస్తున్న విషయం పవన్ కు తెలీదా? కెసిఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా కోర్టు సమీక్షల్లో వీగిపోతున్నాయ్. నిజంగా చెప్పాలంటే తెలంగాణాలో కుటుంబపాలన తప్ప ఇంకేమీ సాగటం లేదు. మరి అటువంటి పాలనలో పవన్ కు ఏమి నచ్చిందో ?

ఇక, జనసేన అధిపతిగా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోనూ  పోటీ చేస్తామని చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. అటువంటిది ఇపుడేమో రాజకీయ నేతలను కలిసి మాట్లాడటం వల్ల ఎంతో కొంత తెలుసుకోవచ్చంటున్నారు. ప్రత్యర్ధులను కలవటం ద్వారా రాజకీయాల్లో పవన్ ఏమి తెలుసుకుంటారు? ప్రత్యర్ధులు అని ఎందుకనాల్సి వచ్చిందంటే, వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ తో కలసి పోటీ చేసేది లేదన్నారు. మరి, కలిసి పోటీ చేయనంటే అర్ధం కెసిఆర్ ప్రత్యర్ధి అనే కదా?

ఇక, తెలంగణాలో విద్యుత్ సరఫరా అద్భుతమన్నారు. వ్యవసాయానికి తెలంగాణాలో 24 గంటల విద్యుత్ సరఫరాను దేశమంతా ఓ కేస్ స్టడీగా తీసుకోవాలని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. కెసిఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదనంగా ఏమైనా విద్యుత్ ఉత్పత్తి చేయటం వల్ల మిగులు విద్యుత్ వచ్చిందా? రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నిరంతర విద్యుత్ సరఫరా ఉంటోందంటే అదే కేంద్రం చలవే అన్న విషయం పవన్ కు తెలీదా? సమస్యల గురించి ప్రస్తావించకుండానే పవన్ కెసిఆర్ పాలన అద్భుతమని పవన్ ఎలా కితాబిస్తారో?

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos