కేంద్రంలో చంద్రబాబునాయుడు మాట చెల్లుబాటు అవటం లేదా ? ఈ ప్రశ్న, అనుమానం చాలా కాలంగా జనాల్లో నానుతోంది. అయితే, తాజాగా జరిగిన ఓ సంభాషణ అనుమానాన్ని నిర్ధారిస్తోంది.

కేంద్రంలో చంద్రబాబునాయుడు మాట చెల్లుబాటు అవటం లేదా ? అనేక విషయాల్లో ఈ ప్రశ్న, అనుమానం చాలా కాలంగా జనాల్లో నానుతోంది. అయితే, తాజాగా జరిగిన ఓ సంభాషణ అనుమానాన్ని నిర్ధారిస్తోంది. ఆదివారం ఉదయం హైదరాబాద్ లోని తన నివాసంలో తెలంగాణా నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. తెలంగాణాలో పార్టీ పరిస్ధితి, వచ్చే ఎన్నికలు, పొత్తులు, టిక్కెట్ల కేటాయింపు, పార్టీ కార్యక్రమాలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

సరే, నేతలతో ముచ్చట్లయిపోయిన తర్వాత మోత్కుపల్లి వ్యవహారం చర్చకు వచ్చింది. ఏదో ఒక రాష్ట్రానికి మోత్కుపల్లిని గవర్నర్ గా నియమించేట్లు చూస్తానంటూ చంద్రబాబు చాలాకాలంగా చెబుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అంటే ఈ విషయమై బహిరంగంగా చంద్రబాబు ఎప్పుడూ చెప్పలేదనుకోండి. కానీ మోత్కుపల్లి మాత్రం చంద్రబాబు తనకిచ్చిన హామీ గురించి బహిరంగంగా చాలా సార్లే ప్రస్తావించారు. కాబట్టి చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగానే అనుకోవాలి.

మోత్కుపల్లి చెబుతూనే ఉన్నారు, చంద్రబాబు ప్రయత్నిస్తూనే ఉన్నారు. చూస్తుండగానే మూడున్నరేళ్లు గడచిపోయాయి. అంటే చంద్రబాబు ఎంత ప్రయత్నించినా మిత్రపక్షమైనా భారతీయ జనతా పార్టీ నుండి టిడిపికి ఒక్క పోస్టు కూడా రాబట్టలేకపోయారన్నది వాస్తవం. అదే విషయం తెలంగాణా నేతలకు, చంద్రబాబుకు మధ్య చర్చ జరిగిందట. ‘ఎన్నిసార్లు అడిగినా ఇస్తామంటారే గానీ ఇవ్వటం లేద’ని చంద్రబాబు నేతలతో చెప్పారట. తాను చెప్పినపుడు ఢిల్లీ పెద్దలు వింటున్నారేగానే సానుకూలంగా స్పందించటం లేదని చెప్పారట.

కేంద్రం వద్ద తన మాట చెల్లుబాటు కానప్పుడు తాను చేయగలిగేది కూడా ఏం ఉంటుంది ? అని నేతలను చంద్రబాబు ఎదురు ప్రశ్నించారట. దాంతో మోత్కుపల్లితో పాటు మిగిలిన నేతలు అవాక్కయ్యారు. అయితే, తర్వాత మోత్కుపల్లి తనతో విడిగా కొద్దిసేపు మాట్లాడాలని అడిగినపుడు ‘ఇపుడు కాదులే’ అంటూ చంద్రబాబు పంపించేసారని పార్టీ వర్గాలు చెప్పాయి.