అభ్యర్ధులుగా అవకాశం ఇవ్వకపోతే భవిష్యత్తులో పార్టీకి ప్రమాధమే అని సంకేతాలు పంపటం కూడా ఇద్దరి విషయంలో పనిచేసినట్లు సమాచారం.
పెద్దల సభకు ఎంపిక చేసిన అభ్యర్ధుల విషయంలో చంద్రబాబు పెద్ద కసరత్తే చేసారు. ప్రధానంగా అభ్యర్ధుల నేపధ్యానికే చంద్రబాబు ఓటు వేసినట్లు చెబుతున్నారు. తమకు అభ్యర్ధులుగా అవకాశం ఇవ్వకపోతే భవిష్యత్తులో పార్టీకి ప్రమాధమే అని సంకేతాలు పంపటం కూడా ఇద్దరి విషయంలో పనిచేసినట్లు సమాచారం. తన కొడుకు లోకేష్ అభ్యర్ధిత్యం చాలా రోజుల ముందే ఖాయం చేసినా మిగిలిన నాలుగురి పేర్లను మాత్రం ఆదివారం అర్ధరాత్రి మాత్రమే ప్రకటించారు. అభ్యర్ధుల సొంత బలంతో పాటు కులం, ప్రాంతం తదితరాలన్నీ చూసిన తర్వాతనే నిర్ణయించారు.
ఎంపిక చేసిన అభ్యర్ధుల్లో ప్రకాశం నుండి సునీత, కరణం బలరాం, కృష్ణా జిల్లా నుండి బచ్చుల అర్జునుడు, గుంటూరు జిల్లా నుండి డొక్కా ఎంపిక కాగా లోకేష్ ది చిత్తూరు అన్న విషయం తెలిసిందే. శ్రీకాకుళం జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతిభా భారతి రెన్యువల్ కోరారు. అయితే, సాధ్యం కాలేదు. ఇక కమ్మ సామాజిక వర్గం నుండి ముళ్ళపూడి రేణుక బాగా ప్రయత్నించారు. మైనారిటీ కోటాలో అబ్దుల్ ఘని లాంటి ఎవరికి కూడా అవకాశం దక్కలేదు.
తమ అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేయకపోతే పార్టీని వీడేందుకు సైతం వెనకాడమంటూ కరణంబలరాం, పోతుల సునీత సన్నిహితుల ద్వారా చంద్రబాబుకు ఫీలర్లు పంపినట్లు ప్రచారంలో ఉంది. అసలే కరణంకు ప్రకాశం జిల్లాలో వైసీపీ నుండి ఫిరాయించిన గొట్టిపాటి రవితో రోజూ సమస్యలే. దాంతో కరణం విసిగిపోయారు. ఈ దశలో వచ్చిన ఎంఎల్సీ ఎన్నికను కరణం బాగానే వాడుకున్నారు. ఇక పోతుల సునీత కూడా తన భర్త పోతుల సురేష్ పరిటాల రవి విషయంలో చేసిన త్యాగాలను పదే పదే గుర్తు చేసారు. అంతేకాకుండా పరిటాల సునీత ద్వారా చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.
డొక్కా ఇటీవలే కాంగ్రెస్ నుండి టిడిపిలోకి మారారు. బచ్చుల కృష్ణా జిల్లా అధ్యక్షుడిగానే కాకుండా బిసి నేతగా కూడా గుర్తింపు పొందారు. వీరికి సామాజిక సమీకరణలు పనిచేసాయి. బహుశా రావెల కిషోర్ బాబుకు డొక్కాను ప్రత్యామ్నాయంగా చంద్రబాబు ఉపయోగించుకోవచ్చేమో. అయితే, అదే జిల్లా నుండి ప్రయత్నాలు చేసుకున్న జెఆర్ పుష్పరాజ్ అభ్యర్ధిత్వాన్ని పరిశీలించకపోవటం గమనార్హం.
