పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్న చంద్రబాబు

First Published 19, Nov 2017, 10:34 AM IST
Is Naidu targeting peddireddy in coming elections
Highlights
  • నల్లారి కిషోర్ రెడ్డిని టిడిపిలోకి చేర్చుకోవటం వెనుక చంద్రబాబునాయుడుకు ఏమైనా వ్యూహముందా?

నల్లారి కిషోర్ రెడ్డిని టిడిపిలోకి చేర్చుకోవటం వెనుక చంద్రబాబునాయుడుకు ఏమైనా వ్యూహముందా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరికీ అదే అనుమానం వస్తోంది. కిషోర్ కుమార్ రెడ్డిని పార్టీలోకి చేర్చుకోవటం, ఫిరాయింపు ఎంఎల్ఏ అమరనాధరెడ్డికి మంత్రిపదవి కట్టబెట్టటం వెనుక చంద్రబాబు దీర్ఘకాలిక వ్యూహం ఉందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

వచ్చే ఎన్నికలకు సంబంధించి ప్రతీ జిల్లాలోనూ వైసీపీ నేతల్లో కొందరిని చంద్రబాబు టార్గెట్ గా పెట్టుకున్నారట. అందులో భాగంగానే సొంత జిల్లా చిత్తూరులో వైసీపీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దశాబ్దాలుగా రాజకీయాల్లో పెద్దిరెడ్డి పాతుకుపోయున్నారు. పీలేరు నియోజకవర్గంలో గట్టిపట్టున్న నేతగా పెద్దిరెడ్డికి పేరుంది. అయితే, నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పెద్దిరెడ్డి పుంగనూరు నియోజకవర్గానికి మారారు. నియోజకవర్గం మారినా జనాధరణలో మాత్రం మార్పు లేదు.

మొన్నటి ఎన్నికల్లో గెలిచిన దగ్గర నుండి జిల్లాలో పార్టీ పరంగా ఏ అవసరం వచ్చినా పెద్దిరెడ్డే ముందుంటారు. రాజంపేట పార్లమెంట్ సభ్యుడు మిధున్ రెడ్డి పెద్దిరెడ్డి కొడుకన్న విషయం అందరకీ తెలిసిందే. అమరనాధరెడ్డి టిడిపిలోకి ఫిరాయించిన తర్వాత తమ్ముడు ద్వారకనాధరెడ్డిని ఇన్ చార్జిగా జగన్మోహన్ రెడ్డి నియమించారు. బహుశా వచ్చే ఎన్నికల్లో పలమనేరు నియోజకవర్గంలో తమ్ముడు పోటీ చేయవచ్చేమో. రాజకీయంగానే కాకుండా ఆర్ధికంగా కూడా బాగా పటిష్టమైన స్ధితిలో ఉన్నారు పెద్దిరెడ్డి.

దశాబ్దాలుగా జిల్లా రాజకీయల్లో చంద్రబాబు-పెద్దిరెడ్డి బద్ద శత్రువులన్న విషయం తెలిసిందే. ఒకవైపు చంద్రబాబుతో పోరాడుతూనే మరోవైపు నల్లారి కుటుంబంతో కూడా పెద్దిరెడ్డి పోరాటం చేస్తున్నారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం నియోజకవర్గంలో ఏ పని కోసం ఒక్కసారి కూడా సిఎంను కలవలేదు. తానసలు కిరణ్ ను సిఎంగా గుర్తించనంటూ కుండబద్దలు కొట్టినట్లు బహిరంగంగా చెప్పిన ఏకైక ఎంఎల్ఏ పెద్దిరెడ్డి మాత్రమే.  కిరణ్ కు సోదరుడే కాబట్టి కిషోర్ తో కూడా పెద్దిరెడ్డికి పడదు. సరే, ఇక అమరనాధ్ రెడ్డి కుటుంబంతో రాజకీయంగా పెద్ద వైరం ఏమీ లేకపోయినా పార్టీ ఫిరాయించారు కాబట్టి మంత్రి అమరనాధరెడ్డి కూడా వైరిపక్షం కిందే లెక్క.

అంటే పెద్దిరెడ్డి వచ్చే ఎన్నికల్లో ఒకేసారి చంద్రబాబు, అమరనాధరెడ్డి, కిషోర్ కుమార్ తో పోరాటం చేయాలన్నమాట. ఎందుకంటే, దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా చంద్రబాబు మంత్రిని, కిషోర్ ను పెద్దిరెడ్డికి వ్యతరేకంగా రంగంలోకి దింపుతున్నట్లే లెక్క. ఒకవైపు పుంగనూరు నుండి మరోవైపు పీలేరు నుండి చంద్రబాబు పావులు కదుపుతున్నారు. వీరిని పెద్దిరెడ్డి ఏ మేరకు ఎదుర్కొంటారన్నది ఆసక్తికరంగా మారింది.

 

loader