చంద్రబాబే నిరాహార దీక్ష చేస్తారట

Is naidu lost his grip on administration
Highlights

  • ‘మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యాలను చేరుకోకపోతే జిల్లాల కలెక్టర్ల తీరుకు నిరసనగా నిరాహార దీక్ష చేస్తా’..ఇవి ఇచ్ఛాపురం పర్యటనలో చంద్రబాబునాయుడు చేసిన హెచ్చరికలు.

‘మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యాలను చేరుకోకపోతే జిల్లాల కలెక్టర్ల తీరుకు నిరసనగా నిరాహార దీక్ష చేస్తా’..ఇవి ఇచ్ఛాపురం పర్యటనలో చంద్రబాబునాయుడు చేసిన హెచ్చరికలు. జన్మభూమి-మనఊరు కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పర్యటించారు. నూరుశాతం మరుగుదొడ్ల నిర్మాణం ఇప్పటి వరకూ 6 జిల్లాలో పూర్తయినట్లు చెప్పారు. మిగిలిన జిల్లాల్లో మార్చి 31కి పూర్తి కాకపోతే ఆయా జిల్లాల కలెక్టర్ల తీరుకు నిరసనగా నిరాహాదా దీక్ష చేస్తానని ప్రకటించారు. కలెక్టర్లలో రోషం పెరగటానికే భోజనం మానేసి దీక్ష చేస్తానని చెప్పారు.

ఇక్కడే  ఓ విషయం అర్ధం కావటం లేదు. ముఖ్యమంత్రి చెబితే కలెక్టర్లే కాదు సకల ప్రభుత్వ యంత్రాంగం మాట వినాల్సిందే.  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుండి అటెండర్ వరకూ  అందరికీ ముఖ్యమంత్రి ఆదేశాలు పాటించటం తప్ప వేరే దారిలోదు. అటువంటిది ఏకంగా ఏడు జిల్లాల కలెక్టర్లు చంద్రబాబు మాట వినటం లేదంటే ఏమిటర్ధం? చంద్రబాబు ఆదేశాలను కలెక్టర్లు లెక్క చేయటం లేదనే అర్ధం వస్తుంది. అంటే పాలనపై తనకుపట్టు తప్పిందని స్వయంగా చంద్రబాబు అంగీకరించినట్లే. లేకపోతే దీక్షలు, నిరసనలు చేయాల్సింది ప్రతిపక్షాలే కానీ అధికారపక్షమో లేకపోతే ముఖ్యమంత్రో కాదు.

మార్చి 31 తర్వాత కూడా మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు ముందుకు రానీ గ్రామాలను గుర్తిస్తారట. ప్రతీ గ్రామానికి వెళ్ళి మరుగుదొడ్లు నిర్మించుకునే వరకూ అక్కడే మకాం వేస్తానని చెప్పటం విచిత్రంగా ఉంది. ఏడు జిల్లాల్లోని కొన్ని వేల గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మాణం జరగలేదు. ఎన్ని గ్రామాలకని చంద్రబాబు వెళతారు ? ప్రతీ ఇంటిలో ఫోన్లుంటున్నాయి కానీ మరుగుదొడ్లు మాత్రం కనిపించటం లేదని చెప్పటం గమనార్హం.

loader