Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు ప్రభుత్వం మరీ అంత వీకా ?

రేపటి ఎన్నికల్లోగా పోలవరం, అమరావతి నిర్మాణాలు ముందుకు సాగే అవకాశాలు కనబడటం లేదు. ప్రతిపక్షం అడ్డుపడటం వల్లే పై పనులను చేయలేకపోయానంటూ ప్రజల్లోకి వెళ్ళటానికి వీలుగా చంద్రబాబు వేదికను సిద్ధం చేసుకుంటున్నారు.

Is naidu Govt that much weak

 

ప్రతిపక్షం అడ్డుపడితే అభివృద్ధి ఆగిపోయే రాష్ట్రాన్ని ఎక్కడైనా చూసారా? మన రాష్ట్రంలో తప్ప..అది కూడా చంద్రబాబు, టిడిపి నేతల మాటల్లోనే సుమా...ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి  చంద్రబాబుకు ఓ మాట ఊతపదమైపోయింది. అదేంటంటే..‘రాష్ట్రాభివృద్ధికి ప్రతిపక్షం అడ్డుపడుతోంది’.

 

చంద్రబాబు ఎప్పుడైతే ఆ మాట మొదలుపెట్టారో మంత్రులు కూడా ఆ మాటను ‘తారకమంత్రం’ (చంద్రమంత్రం)గా పఠిస్తున్నారు. వారు కూడా ప్రతీదానికీ జగన్ పై అదే మాట చెబుతూ విరుచుకుపడుతున్నారు. అంటే ఏమిటి? హోల్ మొత్తం మీద గుడ్డ కాల్చి మొహం మీదేసేయటమన్నమాట.

 

చంద్రబాబు ప్రభుత్వం అదే చేస్తోంది. తాజాగా బాబు చెబుతున్న మాటల ప్రకారం..పోలవరం నిర్మాణానికి జగన్ అడ్డుపడుతున్నారు. మొన్నేమో పట్టిసీమ ప్రాజెక్టు కట్టటం జగన్ కు ఇష్టం లేదన్నారు. అందుకనే ప్రాజెక్టు ముందుకు సాగకుండా ఆటంకాలు సృష్టిస్తున్నట్లు ఎన్నోసార్లు ఆరోపించారు.

 

నిజంగా పట్టిసీమ నిర్మాణం జగన్ కు ఇష్టం లేదనే అనుకుందాం. మరి ప్రాజెక్టును చంద్రబాబు ఎలా కట్టగలిగారు? రికార్డు సమయంలోనే పట్టిసీమను కట్టామని ఆయనే ప్రకటించారు కదా?

 

ఇక, రాజధాని అమరావతిని నిర్మించటం ప్రతిపక్షానికి ఇష్టం లేదంటున్నారు. అందుకనే రైతులను భూములు ఇవ్వకుండా ప్రతిపక్షం అడ్డుపడుతున్నట్లు ఇప్పటికే చంద్రబాబు, ఆయన భజన మంత్రులు ఎన్నోమార్లు ఆరోపించారు. అమరావతి నిర్మాణానికి తాము అడ్డే కాదని జగన్ ఎన్నోమార్లు చెప్పారు. కాకపోతే, రైతుల భూములను బలవంతంగా తీసుకోవద్దని మాత్రమే చెబుతున్నారు.

 

అదే మాటను మిగిలిన ప్రతిపక్షాలతో పాటు జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ కూడా చెబుతున్నారు కదా? రైతుల భూములను తీసుకునే విషయంలో న్యాయస్ధానాలు కూడా స్టే ఇచ్చాయి కదా? జగన్ విషయంలో చేస్తున్న ఆరోపణలు పవన్, న్యాయస్ధానాల విషయంలో చంద్రబాబు ఎందుకు చేయటం లేదు?

 

భోగాపురం విమానాశ్రయం, బందర్ పోర్టు అభివృద్ధి, గోదావరి జిల్లాలో ఆక్వా ఫుడ్ పార్క్ ఏర్పాటు తదితరాలకూ ప్రతిపక్షం అడ్డుపడుతోందని తరచూ చంద్రబాబు ఆరోపిస్తూనే ఉన్నారు. ప్రతిపక్షం మాట ఎలాగున్నా తాను అనుకున్న పనిని సీఎం చేసుకుంటూనే పోతున్నారు.

 

న్యాయస్ధానాల్లో గానీ, ట్రైబ్యునల్లో గానీ ఎక్కడ చెప్పాల్సింది అక్కడ చెబుతూ తన పనిని కానిచ్చేస్తున్నారు.

 

ప్రజా గొంతును వినిపించటమే ప్రతిపక్షం పని. పదేళ్ళు ప్రతిపక్షంలో కూర్చున్నపుడు చంద్రబాబు చేసిందేమిటి? వైఎస్ తీసుకున్న ప్రతీ నిర్ణయాన్నీ తప్పుపట్టారు కదా? వైఎస్ నిర్ణయాలకు వ్యతిరేకంగా రాష్ట్రమంతటా తిరిగి ధర్నాలు, నిరాహారదీక్షలు కూడా చేసారు కదా? మరి అప్పట్లో చంద్రబాబు కూడా అభివృద్ధి నిరోధకుడేనా?

 

రేపటి ఎన్నికల్లోగా పోలవరం, అమరావతి నిర్మాణాలు ముందుకు సాగే అవకాశాలు కనబడటం లేదు. ప్రతిపక్షం అడ్డుపడటం వల్లే పై పనులను చేయలేకపోయానంటూ ప్రజల్లోకి వెళ్ళటానికి వీలుగా చంద్రబాబు వేదికను సిద్ధం చేసుకుంటున్నారు. ఇంతకీ ప్రతిపక్షం అడ్డుకుంటే అభివృద్ధి ఆగిపోయేంత బలహీన ప్రభుత్వమా చంద్రబాబుది ?

Follow Us:
Download App:
  • android
  • ios