ఈనెల 23వ తేదీన జరుగనున్న రాజ్యసభ ఎన్నికల్లో రెండు సీట్లకే పోటీ చేయాలని చంద్రబాబునాయుడు నిర్ణయించారా? పార్టీ నేతల సమాచారం ప్రకారం అలానే అనిపిస్తోంది. ఏపిలో భర్తీ చేయాల్సిన మూడు స్ధానాలకు సోమవారంతో నామినేషన్ల గడువు ముగుస్తోంది. ఎంఎల్ఏల బలం ప్రకారం టిడిపికి రెండు స్ధానాలు, వైసిపికి ఒక్క స్ధానం దక్కుతుంది.

రాజ్యసభ ఎన్నికల్లో ఒకవేళ ఓటింగ్ అవసరమైతే ప్రతీ స్ధానానికి 44 మంది ఎంఎల్ఏలు ఓటు వేయాల్సుంటుంది. టిడిపికి ఉన్న 103 మంది ఎంఎల్ఏల బలం ప్రకారం రెండు స్దానాలకు ఢోకాలేదు. వైసిపికున్న 44 మంది ఎంఎల్ఏల ప్రకారం ఒక్కస్ధానం దక్కుతుంది. అయితే, వైసిపిని దెబ్బ కొట్టాలంటే టిడిపి మూడో స్దానానికి పోటీ పెట్టాల్సుంటుంది.

ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయాలని చంద్రబాబు ముందు అనుకున్నారు. అయితే, హటాత్తుగా తలెత్తిన రాజకీయ పరిణామాల్లో చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోయింది. కేంద్రం నుండి సహకారం లేకపోవటం, టిడిపి కేంద్రమంత్రులతో రాజీనామాలు చేయించాల్సి వచ్చింది. అదే సమయంలో ప్రత్యేకహోదాపై జనాల్లో సెంటిమెంట్ పెరిగిపోయింది.

దానికితోడు జగన్ అన్ని వైపుల నుండి చంద్రబాబుపై ఉచ్చు బిగిస్తున్నారు. ఇది చాలదన్నట్లు మిత్రపక్షం బిజెపి నుండి తలనొప్పులు, ఫిరాయింపుల నుండి అందే సహకారంపై అనుమానాలు. వీటన్నింటిపై వైసిపి ఎంఎల్ఏలతో మంత్రులు మాట్లాడినపుడు రికార్డయిన టేపులు తదితరాల్లో చంద్రబాబులో మరింత ఆందోళన పెరిగిపోయింది.

అసలే, తెలంగాణాలో ‘ఓటుకునోటు’ కేసు ఇబ్బంది పెడుతోంది. దానికి అదనంగా  వైసిపి ఎంఎల్ఏలతో మంత్రులు మాట్లాడిన టేపులున్నాయని వైసిపి నేతలు చెప్పటం చంద్రబాబును బాగా కలవర పెడుతున్నట్లుంది. రాజ్యసభలో మూడో అభ్యర్ధిని పోటీకి పెడితే గెలిచేంత వరకూ అనుమానమే. టిడిపి వైపు నుండి ఎవరైనా క్రాస్ ఓటింగ్ చేసి వైసిపి అభ్యర్ధి గెలిస్తే చంద్రబాబు పరిస్ధితి ఇక చెప్పనే అక్కర్లేదు.

అందుకే ఇటువంటి సమస్యలన్నింటినీ ఆలోచించే మూడో అభ్యర్ధిని పెట్టకపోవటమే మంచిదని చంద్రబాబు సీనియర్ నేతలతో చెప్పారట. అందుకు అనుగుణంగానే ఇద్దరు అభ్యర్ధులపై చర్చలు జరుగుతున్నాయి. మరి సోమవారం నాటికి ఏం జరుగుతుందో చూడాలి?