Asianet News TeluguAsianet News Telugu

వైసిపిని దెబ్బకొట్టేందుకు ప్లాన్ చేస్తున్నారా ?

  • ఏ పార్టీలో ఉందో తెలీని కర్నూలు ఎంపి బుట్టా రేణుక వైసిపిని దెబ్బ కొట్టాలని కంకణం కట్టుకున్నట్లున్నారు.
Is MP butta trying to demoralize ycp in the kurnul dt

ఏ పార్టీలో ఉందో తెలీని కర్నూలు ఎంపి బుట్టా రేణుక వైసిపిని దెబ్బ కొట్టాలని కంకణం కట్టుకున్నట్లున్నారు. సోమవారం ఉదయం కర్నలులో జరిగిన ఓ పరిణామం చూస్తుంటే అదే అనుమానం వస్తోంది. 2014 ఎన్నికల్లో రేణుక వైసిపి నుండి గెలిచిన సంగతి అందరకీ తెలిసిందే. అయితే, తర్వాత జరిగిన పరిణామాల్లో ఎంపి టిడిపిలో చేరుతున్నారంటూ చాలా సార్లు వార్తలు రావటం దాన్ని బుట్టా ఖండించటం అందరూ చూసిందే. ఎలాగైతేనేం దాదాపు నెలరోజుల క్రితం బుట్టా వైసిపిని వదిలేసారు. తన మద్దతుదారులతో చంద్రబాబునాయుడును కలిసారు. అయితే ముందు జాగ్రత్తగా మద్దతుదారులకు మాత్రం చంద్రబాబుతో కండువా కప్పించారు.

ఇదే విషయాన్ని తర్వాత మీడియాతో మాట్లాడుతూ, తన మద్దతుదారులు మాత్రమయే టిడిపిలో చేరారని, తాను చేరలేదంటూ బుకాయించారు. తనను తాను ఎంతో గొప్పగా ఊహించుకున్న రేణుక చివరకు చతికలపడ్డారు లేండి. ఎందుకంటే, తన వెంట నియోజకవర్గంలోని నేతలు, పార్టీ శ్రేణులందరూ టిడిపిలో చేరిపోతారని అనుకున్నారు. అయితే, బుట్టా వెనుక పట్టమని పదిమంది కూడా లేరు.

అయితే, తాజాగా వైసిపి కర్నూలు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనీల్ కుమార్ తో పాటు మరికొందరు టిడిపి తీర్ధం పుచ్చుకున్నారు.  యువజన శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపి బుట్టా రేణుక సమక్షంలో వీరు టిడిపిలో చేరారు. సరే, చేరేటపుడు చంద్రబాబు విధానాలు నచ్చే ఆకర్షితులమైనట్లు చెప్పటం సహజమే కదా? వీరు కూడా అలానే చెప్పారనుకోండి అదివేరే సంగతి. బుట్టా రేణుక వ్యవహారం చూస్తుంటే చాపక్రింద నీరులా కర్నూలు నియోజకవర్గం పరిధిలో వైసిపిని దెబ్బ కొట్టాలని ఏమన్నా ప్రయత్నిస్తున్నారా అన్న అనుమానాలు మొదలయ్యాయి.

Follow Us:
Download App:
  • android
  • ios