మొన్నటికి మొన్న ఉపాధిహామీ పనులకు నిధుల విడుదలను కేంద్రం ఆపేసింది. అంతకుముందు రెవిన్యూలోటు భర్తీ విషయంలోనూ కేంద్రం రాష్ట్రానికి పెద్ద షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రాజెక్టు పనుల్లో పారదర్శకత లోపించిందని తాజాగా మండిపడింది. ఇప్పటి వరకూ వ్యయం చేసిన నిధుల లెక్క తేలాకే కొత్తగా నిధులు విడుదల చేస్తామని రాష్ట్రానికి కేంద్రం స్పష్టం చేయట గమనార్హం.
కేంద్రంలోని నరేంద్రమోడి ప్రభుత్వం చంద్రబాబునాయుడును దూరం పెట్టేస్తందా? జాతీయస్ధాయిలో మారుతున్న రాజకీయ సమీకరణలో భాగంగా చంద్రబాబు అవసరం ఎన్డీఏకి లేదని నరేంద్రమోడి భావిస్తున్నారా? బీహార్ సిఎం నితీష్ కుమార్ లాంటి వాళ్ళతో కొత్త సంబంధాలు కలుపుకోవటం ద్వారా పాత మిత్రుల్లో కొందరిని వదిలించుకోవాలని మోడి అనుకుంటున్నారా? జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే ఎవరికైనా అవే అనుమానాలు వస్తాయి.
రాష్ట్రం విషయంలో తాజాగా కేంద్రం అనుసరిస్తున్న వైఖిరి కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. రెవిన్యూలోటు భర్తీ కావచ్చు, ఉపాధిహామీ పనుల నిధుల విషయం కావచ్చు. తాజాగా పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం తీసుకున్న నిర్ణయం కూడా అదే అనుమానాన్ని బలపరుస్తోంది. ఇవన్నీ చూస్తుంటే రెండు ప్రభుత్వాల మధ్య ఏదో జరుగుతోందన్న అనుమానాలు కలుగుతున్నాయి. అందులోనూ వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా వెళ్ళిపోయిన తర్వాతే హటాత్తుగా ఈ పరిణామాలు మొదలవ్వటం గమనార్హం.
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే విషయమే తీనుకుంటే, చంద్రబాబునాయుడు చెప్పేదానికి, జరుగుతున్న దానికి ఏమాత్రం సంబంధం ఉండదు. ప్రాజెక్టు పూర్తయ్యే విషయంలో ముఖ్యమంత్రి, మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు ఎన్ని మాటలు మార్చారో అందరికీ తెలిసిందే. పనులు కావటం లేదంటూ సిఎం ఒకవైపు అధికారులపై ఆగ్రహాలు వ్యక్తం చేస్తూనే ఇంకోవైపు 2018లోనే పూర్తవుతుందని చెప్పేస్తుంటారు. ఇక, అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టు పూర్తవ్వటానికి మరో ఐదేళ్ళు పడుతుందని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
ఇటువంటి నేపధ్యంలోనే ప్రాజెక్టు పనుల్లో పారదర్శకత లోపించిందని తాజాగా మండిపడింది. 2018కల్లా ప్రాజెక్టు ఎట్టి పరిస్ధితిలోనూ పూర్తికాదని తేల్చేసింది. పోలవరం ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా ఓ ఈఎన్సీని నియమించాలని నిర్ణయించింది. ఈనెల 18వ తేదీన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ స్వయంగా ప్రాజెక్టును పరిశీలించాలని నిర్ణయించింది. 24న పనుల తనిఖీకి స్వయంగా ప్రాజెక్టు సీఈవోనే కదిలివస్తున్నారు. ఇప్పటి వరకూ వ్యయం చేసిన నిధుల లెక్క తేలాకే కొత్తగా నిధులు విడుదల చేస్తామని రాష్ట్రానికి కేంద్రం స్పష్టం చేయట గమనార్హం.
మొన్నటికి మొన్న ఉపాధిహామీ పనులకు నిధుల విడుదలను కేంద్రం ఆపేసింది. దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు మాత్రం నిధులను విడుదల అవుతూనే ఉంది. మరి, ఏపికే ఎందుకు ఆపేసింది? ఎందుకంటే, ఉపాధి పనులకు గాను కేంద్రం విడుదల చేసిన నిధుల ఖర్చుకు రాష్ట్రం లెక్కలు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? అంటే, కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్రం ఇతరత్రా పనులకు వాడేసింది కాబట్టే లెక్కలు చెప్పలేకపోయింది. కాబట్టి నిధుల లెక్క చెప్పేవరకూ నిధులు ఇచ్చే సమస్యే లేదని కేంద్రమూ చెప్పేసింది. అంతకుముందు రెవిన్యూలోటు భర్తీ విషయంలోనూ కేంద్రం రాష్ట్రానికి పెద్ద షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటువంటి షాకులు ఇంకెన్ని ఇస్తుందో చూడాలి?
