Asianet News TeluguAsianet News Telugu

ప్రతిపక్షాలకు మోడి భయపడుతున్నారా ?

జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే పార్లమెంట్ కు హాజరవ్వటానికి ప్రధాని భయపడుతున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలే నిజమని అనుకోవాల్సి వస్తోంది.

Is modi affraid of facing Opp parties

పెద్ద నోట్ల రద్దు, తదనంతర పరిణామాలపై ప్రధానమంత్రి నరేంద్రమోడి పార్లమెంట్ కు హాజరవ్వటానికి భయపడుతున్నట్లు కనబడుతున్నది. పెద్ద నోట్ల రద్దును ప్రధాని ప్రకటించి ఇప్పటికి 18 రోజులైంది. నోట్ల రద్దైన రెండో రోజు నుండి దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళనలు మొదలుపెట్టారు. అదే సమయంలో ప్రజల్లో ఆందోళన పెరిగిపోయింది. దానికి తగ్గట్లే మీడియాలో కూడా ప్రజా స్పందనను 24 గంటలూ కవర్ చేస్తుండటంతో ప్రభుత్వంలో ఆందోళన మొదలైంది.

 

అదే సమయంలో 16వ తేదీ నుండి పార్లమెంట్ సమావేశాలు కూడా మొదలయ్యాయి. మొదటి రోజు రాజ్యసభలో పెద్ద నోట్ల రద్దుపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని, ప్రధానిని ఏకిపారేసాయి. దాంతో మరుసటి రోజు నుండి ఇటు రాజ్యసభలో గాని అటు లోక్ సభలో గాని మాట్లాడేందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వటం లేదు.

 

అయితే, పార్లమెంట్ వెలుపల మాట్లాడుతున్న మోడి ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు గానీ పార్లమెంట్ కు మాత్రం హాజరవ్వటం లేదు. దాంతో గడచిన 10 రోజులుగా పార్లమెంట్ లో ప్రతి రోజు గందరగోళమే. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే పార్లమెంట్ సమావేశాలకు ఒకసారి మోడి హాజరయ్యారు. లోక్ సభలో ఒకరోజు ప్రశ్నోత్తరాల సమయంలో హాజరైన ప్రధాని ఒక్కమాట కూడా మాట్లాడలేదు.

 

ప్రధాని సభకు వస్తారని కేంద్రంమంత్రి అరుణ్ జైట్లీ, రాజ్యసభ వైస్ ఛైర్మన్ కురియన్ రెండు రోజులుగా ప్రకటించటమే గానీ మోడి మాత్రం ప్రతిపక్షాలను, పార్లమెంట్ ను ఏమాత్రం ఖాతరు చేయటం లేదు. దాంతో అధికార పక్షం కూడా ఇరకాటంలో పడుతున్నది.

 

అయితే, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే జరిగిన భాజపా ఎంపిల సమావేశానికి, మరోసారి పార్లమెంట్ ఆవరణలోనే ఉన్న గ్రంధాలయానికి మాత్రం హాజరైన ప్రధాని పార్లమెంట్లోకి తొంగిచూడటానికి ఏమాత్రం ఆశక్తి చూపకపోవటం ఆశ్చర్యం. గ్రంధాలయ భవనానికి, పార్లమెంట్ భవనానికి మధ్య దూరం కూడా కేవలం 100 మీటర్లే. అయినా అటువైపు వెళ్ళటానికి మోడి ఇష్టపడలేదు. జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే పార్లమెంట్ కు హాజరవ్వటానికి ప్రధాని భయపడుతున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలే నిజమని అనుకోవాల్సి వస్తోంది.

 

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios