Asianet News TeluguAsianet News Telugu

ప్రధాన మీడియా బాధ్యతతో వ్యవహరిస్తోందా ?

ఏదో ఒక రూపంలో మెజారిటీ మీడియాను చంద్రబాబు లోబరుచుకున్నారన్న అభిప్రాయమే సర్వత్రా ఉంది. సోషల్ మీడియ వద్ద వారి ఆటలు సాగలేదు కాబట్టే వారిపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

Is mainstream media discharging its duty impartially in the state

మీడియా గురించి, సోషల్ మీడియా గురించి చంద్రబాబు కొత్త విషయాలు చెప్పారు. ఏంటంటే, పత్రికలు, ఛానెళ్ళకు బాధ్యత ఉంటుందట. ఒకవేళ బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తిస్తే పాఠకులు, వీక్షకులు తగ్గిపోతారనే భయం ఉంటుందట. అటువంటి భయం లేదుకాబట్టే సోషల్ మీడియా ప్రమాదకరంగా తయారైందట. కానీ రాష్ట్రంలో పత్రికలు, ఛానెళ్ళు చంద్రబాబు చెప్పినట్లుగానే బాధ్యతతో వ్యవహరిస్తున్నాయా అన్నదే అసలు ప్రశ్న. టిడిపి ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా కొమ్ము కాసే పత్రికలు, ఛానెళ్ళు లెక్కకు మించి ఉన్నాయన్న సంగతి రాష్ట్రంలోని ఎవరిని అడిగినా చెబుతారు. ఏదో ఒక రూపంలో మెజారిటీ మీడియాను చంద్రబాబు లోబరుచుకున్నారన్న అభిప్రాయమే సర్వత్రా ఉంది. సోషల్ మీడియ వద్ద వారి ఆటలు సాగలేదు కాబట్టే వారిపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

రాష్ట్రంలోని మెజారిటీ మీడియా చంద్రబాబు కనుసన్నల్లోనే సాగుతున్న విషయం వాస్తవం కాదా? గడచిన మూడేళ్ళుగా రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలు, అవినీతి, దందాలు బయటకు వస్తున్నాయా? కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వానికి, ప్రభుత్వ విభాగాలకు ప్యారలెల్ గా వ్యవహరించిన మెజారిటీ మీడియా నోళ్ళు ఇపుడు ఎందుకు మూగబోయాయి. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ సందర్భంగా సిబిఐకి ప్యారలల్ గా విచారణ జరిపి, పరిశోధనాత్మక కథనాలు అందించిన మీడియా మరి ఓటుకునోటు కేసులో ఎందుకు మౌనం వహించింది? కాల్ మనీ సెక్స్ రాకెట్, బోండా ఉమ, కేశినాని రవాణాశాఖ కమీషనర్ పై దురుసుగా వ్యవహరించిన విషయాన్ని లోపలిపేజీలకు మాత్రమే ఎందుకు పరిమితం చేసింది?

మూడేళ్ళు కరువు కాటకాలతో రాష్ట్రంలోని రైతులు అవస్తలు పడుతుంటే ఎందుకు పట్టించుకోలేదు? మొన్ననే జరిగిన స్ధానిక సంస్ధల ఎంఎల్సీ ఎన్నికల్లో టిడిపి పాల్పడిన అవినీతి, అక్రమాలు, ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక విషయంలో టిడిపి ధౌర్జన్యాన్ని మీడియా ఎందుకు పట్టించుకోలేదు? రాజధాని పరిధిలో భూ కుంభకోణం జరిగిందని రాష్ట్రమంతా కోడై కూస్తున్నా చంద్రబాబుకు మద్దతిస్తున్న మీడియాకు మాత్రం ఎందుకు కనబడలేదు? ప్రత్యేకహోదా, పోలవరం, పట్టిసీమలో అవినీతి, ఇలా చెప్పుకుంటే చాలానే ఉన్నాయి. ఏ విషయంలో కూడా ప్రధాన మీడియా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించింది ఎక్కడ?

ప్రధాన మీడియా తన బాధ్యత మరచి చంద్రబాబుకు మద్దతుగా నిలబడింది కాబట్టే సోషల్ మీడియా యాక్టివ్ గా పనిచేస్తోంది. అందులోనూ ప్రభుత్వంలో జరుగుతున్న విషయాలనేమీ సోషల్ మీడియా లోడి బయటకు తీయటం లేదు. కేవలం అందరికీ కనబడుతున్న వాటినే అందులోనూ చంద్రబాబు, లోకేష్ నుండి జాలువారుతున్న ఆణిముత్యాల పైనే వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది. ఒకపుడు కాగితాలపైన వేసిన కార్టూన్లనే ఇపుడు కంప్యూటర్ల ద్వారా వేస్తున్నారు. దీనికే చంద్రబాబు, లోకేష్ ఇబ్బంది పడుతుంటే ఎవరూ చేయగలిగేది ఏమీ లేదు. సోషల్ మీడియాను నియంత్రించటమంటే సముద్రాన్ని దోసిలిలో పట్టుకోవాలని చూడటమే అన్న విషయం చంద్రబాబు, లోకేష్ గుర్తుంచుకోవాలి.

 

.

 

Follow Us:
Download App:
  • android
  • ios