కేశినేనికి చెక్ పట్టే ఉద్దేశ్యంతోనే వచ్చే ఎన్నికల్లో లగడపాటిని టిడిపి తరపున విజియవాడ ఎంపిగా పోటీలోకి దింపే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారంటూ ప్రచారం ఊపందుకున్నది. ఇంకోవైపేమో లగడపాటి వైసీపీలో చేరుతారంటూ ఎప్పటి నుండో ప్రచారం జరుగుతోంది.
లగడపాటి రాజగోపాల్...ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. ఈ సంచలన రాజకీయ నేత తెలుగుదేశం పార్టీకి చేరువవుతున్నారా? శుక్రవారం వెలగపూడిలోని సచివాలయంలో లగడపాటి సిఎంను ఏకాంతంగా కలవటంతో ప్రచారం మొదలైంది. దాదాపు 40 నిముషాల పాటు వీరిద్దరి మధ్యా భేటీ జరిగింది. దానికితోడు భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన లగడపాటి చంద్రబాబుపై ప్రశంసలజల్లు కురిపించటంతో అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. తామిద్దరి మధ్యా భేటీ కేవలం మర్యాదపూర్వకమేనని లగడపాటి చెబుతున్నా ఎవ్వరూ నమ్మటం లేదు. ఎందుకంటే ‘ఊరకరారు మహానుభావుల’న్నట్లు ఏ పనీ లేకుండానే ఇద్దరూ భేటీ అవుతారా? అందులోనూ ఏకాంతంగా 40 నిముషాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమిటి?
ఇటీవల టిడిపిలో చోటు చేసుకుంటున్న పరిణామాలను బట్టే లగడపాటి టిడిపిలో చేరుతారా అన్న అనుమానాలు వ్యక్తమవతున్నాయి. ఎంపి కేశినేని నాని సిఎంకు మధ్య సమస్యలు మొదలయ్యాయని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే కదా? దాంతో కేశినేనికి చెక్ పట్టే ఉద్దేశ్యంతోనే వచ్చే ఎన్నికల్లో లగడపాటిని టిడిపి తరపున విజియవాడ ఎంపిగా పోటీలోకి దింపే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారంటూ ప్రచారం ఊపందుకున్నది. ఇంకోవైపేమో లగడపాటి వైసీపీలో చేరుతారంటూ ఎప్పటి నుండో ప్రచారం జరుగుతోంది. మరి తాజా భేటీ రహస్యమేమిటో కొంత కాలం ఆగితేకానీ బయటకు రాదు.
