Asianet News TeluguAsianet News Telugu

జగన్ సమీక్షకు కొడాలి నాని, వంశీ డుమ్మా.. ఎన్టీఆర్‌ హెల్త్ వర్సిటీ పేరు మార్పే కారణమా..?

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ నిర్వహించిన సమీక్షకు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని హాజరుకాకపోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

is kodali nani and vallabhaneni vamsi disappointment over ntr health university name change
Author
First Published Sep 29, 2022, 1:11 PM IST

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై బుధవారం వైసీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు, కో ఆర్డినేటర్లతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని హాజరుకాకపోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీరిద్దరు.. సమీక్షకు హాజరుకాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగిస్తూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం వల్లనే వారిద్దరు.. సీఎం జగన్ సమీక్షకు హాజరు కాలేదనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. 

హెల్త్ వర్సీటీ పేరు మార్పును.. వైసీపీ నేతలు మినహా రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరును కొనసాగించాలని ప్రతిపక్షాలు, ఎన్టీఆర్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా హెల్త్ వర్సిటీ పేరు మార్పు సరైనది కాదని పేర్కొన్నారు. ఇక, ఎన్టీఆర్ కుమారుడు, హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అయితే జగన్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలే చేశారు. 

మరోవైపు వైసీపీలోని కొందరు నేతలు కూడా హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై కొంత అసంతృప్తితో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఏపీ మంత్రులు, చాలా మంది వైసీపీ నేతలు జగన్ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నప్పటికీ.. కొందరు మాత్రం ఈ నిర్ణయాన్ని హర్షించడం లేదని తెలుస్తోంది. వైసీపీలో ఉన్న ఎన్టీఆర్ అంటే అభిమానం ఉన్న నేతల పరిస్థితి దారుణంగా ఉందని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ సాగుతుంది. 

is kodali nani and vallabhaneni vamsi disappointment over ntr health university name change

ఈ క్రమంలోనే హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై కొడాలి నాని, వల్లభనేని వంశీల స్టాండ్ ఏమిటనేది కొన్ని రోజులుగా టీడీపీ మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు కురిపిస్తున్నారు. అయితే ఇందుకు కారణం లేకపోలేదు.. ఎందుకంటే కొడాలి నాని, వల్లభనేని వంశీలకు ఎన్టీఆర్ మనవడు, ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ సన్నిహితులనే పేరు ఉంది. గతంలో వీరిద్దరు కూడా టీడీపీలో ఉన్నవారే. కొడాలి నాని 2012లో వైసీపీలో చేరారు. అయితే వల్లభనేని వంశీ.. 2019 వరకు టీడీపీలోనే ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన వంశీ.. కొన్ని నెలలకే ఆ పార్టీకి దూరమయ్యారు. వైసీపీలో అధికారికంగా చేరకపోయినప్పటికీ.. ఆ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు. వంశీని వైసీపీ గూటివైపు తీసుకురావడంలో కొడాలి నాని కీలక పాత్ర పోషించారనే సంగతి తెలిసిందే. 

కొడాలి నానికి నందమూరి హరికృష్ణ అంటే అమితమైన గౌరవం. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్‌‌తో మంచి సాన్నిహిత్యం ఉంది. మరోవైపు వంశీకి కూడా జూనియర్ ఎన్టీఆర్‌తో మంచి ఫ్రెండ్షిప్ ఉంది. వీరు ముగ్గురు కూడా చాలా క్లోజ్‌గా ఉండేవారు. జూనియర్ ఎన్టీఆర్‌తో కొడాలి నాని సాంబా చిత్రం నిర్మించగా.. అదుర్స్ చిత్రానికి వంశీ నిర్మాతగా వ్యవహరించారు. గతంలో ఎన్టీఆర్ సినిమాల విషయంలో కూడా కొడాలి నాని ప్రమేయం ఉండదని టాక్ ఉండేది. 

గతంలో టీడీపీ నుంచి కొడాలి నానికి టికెట్ కోసం చంద్రబాబు నాయుడతో జూ. ఎన్టీఆర్ మాట్లాడారని ఇటీవల ఓ ఇంటర్య్వూలో ప్రముఖ దర్శకుడు వివి వినాయక్‌  చెప్పారు. కొడాలి నాని, వంశీలు జూ. ఎన్టీఆర్‌తో నిర్మించిన సాంబా, అదుర్స్ చిత్రాలకు దర్శకుడు వినాయకే కావడంతో.. ఆయన మాటల్లో ఎంతో కొంత నిజం ఉందని చాలా మంది నమ్ముతున్నారు. ఇక, జూనియర్, నాని, వంశీలు కలిసి ఉన్న పాత ఫొటో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో  వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆ ఫొటోను, గతంలో జరిగిన ఘటనలను చూస్తే వాళ్లు ముగ్గురు అప్పట్లో ఎంత క్లోజ్‌గా ఉండేవారో అర్థమవుతుంది. 

 

అయితే గతంలో ఉన్నట్టుగా జూ. ఎన్టీఆర్‌తో వంశీ, నానిలకు సత్సబంధాలు లేవనే ప్రచారం కూడా ఉంది. అయితే కొడాలి నాని, వంశీలు నందమూరి కుటుంబంలో మిగిలిన వారి గురించి ఎన్ని విమర్శలు చేసినప్పటికీ.. జూ.ఎన్టీఆర్‌ను ఒక్క మాట అనడానికి కూడా ఇష్టపడరని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే వారు పలు సందర్భాల్లో సీనియర్ ఎన్టీఆర్‌పై తమకున్న అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. 

ఈ క్రమంలోనే హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై వారు ఎలాంటి వైఖరితో ముందుకు సాగుతారనే ఆసక్తి.. రాజకీయ వర్గాలతో పాటు జూ. ఎన్టీఆర్ అభిమానుల్లోనూ నెలకొంది. జగన్ సర్కార్ నిర్ణయాన్ని ఖండిచకపోయినప్పటికీ.. ఎన్టీఆర్‌ పేరును కొనసాగించాలంటూ వంశీ విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ పేరుతో జిల్లా ఏర్పాటు చేయడం చారిత్రాత్మకం అని.. అదే జిల్లాలో ఎన్టీఆర్ గారి చొరవతోనే ఏర్పాటైన ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఆ మహనీయుడి పేరే కొనసాగించే అవకాశాన్ని పరిశీలించాలని సీఎం జగన్‌ను కోరారు. మరోవైపు అయితే హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై కొడాలి నాని ఇప్పటివరకు స్పందించలేదు. ఈ విషయంలో ఆయన వ్యుహాత్మక మౌనం పాటిస్తూ వస్తున్నారు.  

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు తర్వాత.. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన వైసీపీ ఎమ్మెల్యేల తొలి సమావేశానికి కొడాలి నాని, వంశీలు దూరంగా ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై అసంతృప్తితోనే వారు జగన్ నేతృత్వంలోనే సమావేశానికి వారు హాజరుకాలేదని ప్రచారం జరుగుతుంది.  అయితే ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉందో.. కొడాలి నాని, వల్లభనేని వంశీలే చెప్పాలి.   

Follow Us:
Download App:
  • android
  • ios