టికెట్ దక్కే అవకాశం లేదనుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేలలో ఆందోళన మొదలయ్యింది. ఇప్పటివరకు జగన్ నమ్ముకుని ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ వారు ఏం చేయాలో తోచక ఇబ్బంది పడుతున్నారు. టికెట్లు నిరాకరించిన వారిలో తమ పేర్లు ఉన్నట్టుగా అధికారికంగా ప్రకటన రాగానే తిరుగుబాటు చేయాలని సిద్ధమవుతున్నారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీలో సర్వేలు కలకలం సృష్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్వేల సాకుతో సిట్టింగులకు టికెట్లు నిరాకరిస్తే ఊరుకోబోమంటూ అసమ్మతి సెగ రగులుతోంది. సంక్షేమ పథకాలనే నమ్ముకుని అభివృద్ధి పనులను పక్కన పెట్టారని వారు అంటున్నారు. గత నాలుగున్నరేళ్లుగా తాము చేస్తున్న పనిని పక్కన పెట్టి కొత్త వారికి టికెట్ ఇస్తామంటే ఎలా ఊరుకోవాలంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రజా వ్యతిరేకత ఎమ్మెల్యేలపై లేదని ప్రభుత్వం పైనే ఉందంటూ కొత్తరాగం అందుకున్నారు. తాము ఎన్నుకుంటేనే వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారంటూ చెబుతున్నారు.
ఓవైపు ఈసారి సిట్టింగులకు దాదాపు 60 మందికి టికెట్లు రావంటూ ప్రచారం జరుగుతోంది. దీని మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల ఇన్చార్జిలను మార్చడంతో పార్టీ కుదుపుకు గురైంది. టికెట్ దక్కే అవకాశం లేదనుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేలలో ఆందోళన మొదలయ్యింది. ఇప్పటివరకు జగన్ నమ్ముకుని ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ వారు ఏం చేయాలో తోచక ఇబ్బంది పడుతున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రైతాంగాన్ని ఆదుకొండి..: కేంద్ర బృందానికి టిడిపి వినతి
టికెట్లు నిరాకరించిన వారిలో తమ పేర్లు ఉన్నట్టుగా అధికారికంగా ప్రకటన రాగానే తిరుగుబాటు చేయాలని సిద్ధమవుతున్నారు. గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో జరిపిన వర్క్ షాప్ తర్వాత ఈ గందరగోళం మొదలయ్యింది. ఆ తర్వాత రెండో విడత జరిగిన వర్క్ షాప్ లో అందరికీ టికెట్లు ఇస్తానని చెప్పడంతో కొంత సద్దుమణిగింది. కానీ తాజాగా ఏడుగురు ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడానికి నిరాకరించడంతో ధిక్కారస్వరాలు మళ్లీ మొదలవుతున్నాయి. ఈ ఏడుగురు ఎమ్మెల్యేలలో ఆళ్ల రామకృష్ణారెడ్డి, టీజేఆర్ సుధాకర్ బాబులు కూడా ఉన్నారు.
మరోవైపు మరి కొంతమంది నేతలు మాత్రం.. పార్టీ నిర్ణయం సబబే అంటూ.. పార్టీ భవిష్యత్తుకి మంచిది అంటూ చెబుతున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంతంగా స్థాపించిన పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి ఇలాంటి మార్పులు సహజమేనని.. వీటిని అంగీకరించాల్సిందేనని అంటున్నారు.
ఇంతకీ సర్వేలు చెబుతున్నాయి అంటే…
ఆగస్టులో టైమ్స్ నౌ ఈటీజీ ఒపీనియన్ పోల్ సర్వే నిర్వహించింది. ఈ ఏడాది జూన్ 15 నుంచి ఆగస్టు 12వ తేదీ మధ్య ఈ సర్వే నిర్వహించింది. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి జరిపిన ఈ సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి అత్యధిక స్థానాలు వస్తాయి.. అధికార వైసిపికి ఎన్ని సీట్లు.. టిడిపి ఎన్ని స్థానాల్లో గెలుపొందుతుంది? బిజెపి, జనసేన పరిస్థితి ఏంటి? అనే దానిమీద ఈ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో వైసిపి క్లీన్ స్వీప్ చేస్తుందని ఆసక్తికర ఫలితాలు వెలుగు చూశాయి.
పార్లమెంటు ఎన్నికల మీద చేసిన ఈ సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార వైఎస్ఆర్సిపి 24 నుంచి 25 లోక్ సభ స్థానాలలో గెలుపొందుతుందని తెలిపింది. టిడిపి జనసేన పొత్తు ప్రభావం లోక్ సభ ఎన్నికల్లో అంతగా ఉండకపోవచ్చు అని తెలిపింది. అసెంబ్లీ స్థానాల్లో కూడా 151 కంటే ఎక్కువ సీట్లు లభిస్తాయని.. 168 సీట్ల వరకు వైసిపి దక్కించుకుంటుందని ఈ సర్వే తేల్చింది.
మరోవైపు ఐప్యాక్ కూడా ఓ సర్వే నిర్వహించింది. దీంట్లో వైసీపీకి ఓట్ల శాతం పెరుగుతుందని 113నుంచి 118 సీట్ల వరకి దక్కించుకుంటుందని తేల్చింది. అయితే, గెలుపు గుర్రాలపై కూడా సమాచారమిచ్చింది. దీంతో, మరిన్ని సర్వేల ఆధారంగా జగన్ నియోజకవర్గాల ఇన్చార్జిలా మార్పుకు నడుం బిగించారు. ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో మార్పులు చేశారు. మరో 27 నియోజకవర్గాల్లో ఇన్చార్జిలను మార్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
