మిచౌంగ్ తుఫాను కారణంగా జరిగిన పంటనష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటిస్తోంది. ఈ బృందాన్ని కలిసిన టిడిపి నాయకులు  రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. 

అమరావతి : ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మిచౌంగ్ తుఫాను భీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, వీచిన ఈదురుగాలులకు పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో ఈ తుఫాను వల్ల జరిగిన పంటనష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటిచింది.

మిచౌంగ్ తుఫాను ప్రభావం ఎక్కువగా వున్న ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది. నేరుగా దెబ్బతిన్న పంటపొలాల వద్దకు వెళ్లి రైతుల నుండి వివరాలు సేకరించారు. స్థానిక అధికారులను అడిగి ఏ పంట ఎంతమేర నష్టపోయిందో తెలుసుకున్నారు. 

పంటనష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృందాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు కలిసారు. తడిచిన ధాన్యం చేతపట్టుకుని వచ్చి కేంద్ర బృందం సభ్యులకు చూపించారు. తీవ్ర నష్టాన్ని చవిచూసిన రైతులను ఆదుకోవాలని... నష్టపరిహారం అందించడంలో కాస్త ఉదారంగా వ్యవహరించాలని టిడిపి నాయకులు కోరారు. వర్షపునీటిలో తడిసి రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని... నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని కోరారు. ఈ మేరకు కేంద్ర బృందానికి టిడిపి నాయకులు వినతిపత్రం అందించారు. 

Also Read పులివెందులలోనూ జగన్ రెడ్డిని ఓడిస్తాం..: బుద్దా వెంకన్న సవాల్

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలపరిధిలోని గ్రామాల్లో కేంద్ర బృందం పర్యటిస్తుండగా టిడిపి నాయకులు కలిసారు. మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మాజీ మంత్రి దేవినేని ఉమ, మాజీ ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, బోడె ప్రసాద్ తో పాటు పలువురు నాయకులు కేంద్ర బృందాన్ని కలిసారు. వీరు దెబ్బతిన్న పంటలను కేంద్ర బృందానికి చూపించారు. 

ఇక బాపట్ల జిల్లా చెరుకుపల్లిలో పర్యటించిన కేంద్ర బృందాన్ని టిడిపి నేత వేగేశన నరేంద్రతో పాటు ఇతర నాయకులు కలిసారు. వారికి దెబ్బతిన్న పంటలు చూపించి వినతిపత్రం అందించారు. రాష్ట్ర ప్రభుత్వం తుఫాను కారణంగా పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన రైతులను గాలికి వదిలేసిందని అన్నారు. వారిని కేంద్రమే ఆదుకోవాలని నరేంద్ర కోరారు.