వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైఖరిలో మార్పు స్పష్టంగా కనబడుతోంది. కర్నూలు జిల్లాలో పార్టీ మారుతారని ప్రచారం జరుగుతున్న నేతలతో జగన్ సుదీర్ఘంగా చర్చించటమే అందుకు నిదర్శనం అవసరాన్ని గుర్తించి తన వైఖరిని మార్చుకున్నారా లేక ఎవరి సలహా మేరకైనా మార్చుకున్నారా అన్నది వేరే విషయం.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైఖరిలో మార్పు స్పష్టంగా కనబడుతోంది. కర్నూలు జిల్లాలో పార్టీ మారుతారని ప్రచారం జరుగుతున్న నేతలతో జగన్ సుదీర్ఘంగా చర్చించటమే అందుకు నిదర్శనం అవసరాన్ని గుర్తించి తన వైఖరిని మార్చుకున్నారా లేక ఎవరి సలహా మేరకైనా మార్చుకున్నారా అన్నది వేరే విషయం. కర్నూలు జిల్లాకు చెందిన నలుగురు నేతలు టిడిపిలోకి ఫిరాయిస్తున్నారనే ప్రచారం ఎప్పటి నుండో జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే.
కర్నూలు ఎంపి బుట్టా రేణుక, మంత్రాలయం, ఆలూరు, ఆదోని ఎంఎల్ఏలు బాలనాగిరెడ్డి, జయరామ్, వై. సాయిప్రసాద్ రెడ్డి, ఎమ్మిగనూరు మాజీ ఎంఎల్ఏ చెన్నకేశవరెడ్డి పార్టీ మారిపోతారంటూ ప్రచారం ఎక్కువైంది. ఈ నేపధ్యంలోనే జగన్ కర్నూలు నేతలతో శనివారం దాదాపు గంటన్నరపాటు సమావేశమయ్యారు.
వారి మధ్య జరిగిన సంభాషణ కచ్చితంగా ఏంటనే విషయం బయటకు పొక్కలేదు. అయితే పార్టీని వీడొద్దని జగన్ వారికి సూచించారంటూ ప్రచారం జరుగుతోంది. నవంబర్ 2వ తేదీ పాదయాత్ర మొదలైతే రాష్ట్రంలో పరిస్ధితులు మారిపోతాయని జగన్ చెప్పారట. పార్టీ మారే ఆలోచనలు చేయవద్దని, రాబోయేది వైసీపీ ప్రభుత్వమే అని నచ్చచెప్పారట. ఇపుడు ప్రాతినధ్యం వహిస్తున్న స్ధానాల్లో తిరిగి పోటీ చేసేట్లు హామీ కూడా ఇచ్చారట.
బుట్ట రేణుక విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారట. పార్టీ మారే ఉద్దేశ్యం తనకు లేదని బుట్టా స్పష్టం చేసారట. ప్రచారం ఎందుకు జరుగుతోందో తనకు అర్ధం కావటం లేదని ఎంపి చెప్పారట. వచ్చే ఎన్నికల్లో పోటీ విషయమై బుట్టాకు హామీ కూడా ఇచ్చారట. సరే, జగన్ ముందు అందరితోనూ తర్వాత విడివిడిగా కూడా మాట్లాడారట.
సరే, ఇక్కడ ఎవరితో ఏం మాట్లాడారన్నది అంత ముఖ్యం కాదు. అసలు మాట్లాడటమే ముఖ్యం. ఎందుకంటే, మొన్నటి వరకూ 21 మంది ఎంఎల్ఏలు టిడిపిలోకి ఫిరాయించారు. వారంతా ఫిరాయించేముందే వైసీపీ నుండి వెళ్ళిపోతారని ప్రచారం కూడా జరిగింది. అయితే, వారెవ్వరితోనూ మాట్లాడేందుకు జగన్ పెద్దగా ఆసక్తి చూపలేదన్నది వాస్తవం. విజయసాయిరెడ్డో లేకపోతే వైవీ సుబ్బారెడ్డో మాట్లాడేవారు. వెళిపోదలుచుకున్న వారి విషయంలో ‘పోతే పోనీలే’ అన్నట్లుండేది జగన్ వైఖరి. కానీ ఇపుడు మాత్రం అలా ఊరుకోలేదు.
పార్టీని వీడిపోతారంటూ ప్రచారం జరుగుతున్న వారితో సుదీర్ఘంగా భేటీ అవ్వటమన్నది జగన్ మారిన వైఖరికి నిదర్శనంగానే భావించాలి. వారిలోని అసంతృప్తిని గుర్తించటం, దాన్ని తొలగించేందుకు ప్రయత్నించటం, భవిష్యత్ పట్ల వారికి హామీనివ్వటమన్నది మంచి పరిణామమే. సరే, జగన్ ఇంత ప్రయత్నించినా వారు పార్టీలోనే ఉంటారా అంటే గ్యారెంటీ ఏముంటుంది? అది వారిష్టం.
