పారిశ్రామికవేత్తలకు చంద్రబాబునాయుడుపై నమ్మకం తగ్గిందా? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. అందుకు తాజాగా ముగిసిన పెట్టుబడుల సదస్సే ఉదాహరణగా నిలిచింది.  సిఐఐ భాగస్వామ్యంలో మూడు రోజుల పాటు విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడుల సదస్సులో దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో ప్రభుత్వం రూ. 4.39 లక్షల కోట్ల విలువైన 734 ఒప్పందాలు చేసుకుంది.

అంతా బాగానే ఉంది కానీ ఇక్కడే చిన్న మతలబుంది. అదేంటంటే, మొన్న ముగిసిన పెట్టుబదుల సదస్సు మూడోది. అంటే, 2016లో మొదటిసారి, 2017లో రెండోసారి ప్రభుత్వం పెట్టుబడుల సదస్సును నిర్వహించిన సంగతి అందరికీ తిలిసిందే. మొదటిసారి సదస్సు నిర్వహించినపుడు రూ. 3.4 4 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయి. రెండో సదస్సులో ఏకంగా రూ. 7 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు జరిగినట్లు స్వయంగా చంద్రబాబే ప్రకటించారు.

అంటే, మొదటి రెండు సంవత్సరాల్లో జరిగిన సదస్సుల ద్వారా సుమారు రూ. 11 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయి. మరి, మూడో సంవత్సరంలో మాత్రం రూ. 4.39 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలే జరగటమేంటి? రెండో సంవత్సరం జరిగిన రూ. 7 లక్షల విలువైన ఒప్పందాలెక్కడ? తాజా సదస్సులో జరిగిన రూ. 4.39 లక్షల కోట్ల విలైన ఒప్పందాలెక్కడ? అంటే పోయిన ఏడాదికన్నా ఇపుడు ఏకంగా రూ. 3 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు తగ్గిపోయాయి.

మూడో సదస్సులో మరింత పెరగాల్సిన ఒప్పందాల విలువ తగ్గిపోయాయంటే అర్ధమేంటి? చంద్రబాబు మీద నమ్మకం తగ్గిపోయినట్లేనా? ఎందుకంటే, ఎవరు పెట్టుబడులు పెట్టాలన్నా పోయిన రెండు సదస్సుల్లో జరిగిన ఒప్పందాల విలువను పరిగణలోకి తీసుకుంటారు. అప్పట్లో పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేరిందన్న విషయాన్ని చూస్తారు. లేకపోతే ఒప్పందాలు చేసుకున్న పారిశ్రామికవేత్తలు ఎందుకు వెనక్కు తగ్గారన్న విషయంపై ఆరాతీస్తారు? దాన్ని ఫీడ్ బ్యాక్ ఆధారంగానే పెట్టుబడుల ఒప్పందాలకు ముందుకొస్తారు.

బహుశా ఏపిలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఉపయోగాలు లేవని పారిశ్రామికవేత్తలు అనుకున్నారేమో? అందుకే ఒక్కసారిగా లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు తగ్గిపోయాయి. అందులోనూ పోయిన రెండు సదస్సుల్లో జరిగిన ఒప్పందాల తర్వాత వచ్చిన పెట్టుబడులు పెద్దగా లేవన్న విషయం తెలిసిందే. అంటే, ప్రచారార్భాటమే తప్ప నిజంగా వచ్చిన పెట్టుబడులు లేవనే చెప్పాలి.