ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తారనుకున్న ఎవరికీ ఎటువంటి అనుమతులూ ఇవ్వకూడదని ప్రభుత్వం అనుకున్నట్లే కనబడుతోంది.

చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో విచిత్రమైన ఆంక్షలు అమలవుతున్నాయి. మొన్న ముద్రగడపద్మనాభం, ఇపుడు జగన్మోహన్ రెడ్డి వంతు. తనకు ఎవరైనా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని అనుమానం వస్తే చాలా వారిని ఇబ్బందులు పెడుతోంది. జగన్ అంటేనే ప్రభుత్వం ఉలిక్కిపడుతోందని అందరికీ అర్ధమవుతోంది. రాజధాని ప్రాంతంలోని నిడమర్రు, లింగయాపాలెం గ్రామాల రైతులతో ముఖాముఖి జరిపేందుకు జగన్ గురువారం పర్యటించాలనుకున్నారు. దాంతో ప్రతిపక్ష నేత పర్యటనకు ప్రభుత్వం ఎక్కడా లేని ఆంక్షలను విధిస్తోంది. ప్రభుత్వ ఉద్దేశ్యం ప్రకారం రాజధాని ప్రాంత గ్రామాల్లో జగన్ తిరగకూడదన్నట్లే ఉంది.

ప్రభుత్వ ఆంక్షల మాట ఎలాగున్నా తాను పర్యటించటానికే జగన్ నిర్ణయించారు. దాంతో ప్రభుత్వంలో కలవరపాటు మొదలైంది. ఎట్టి పరిస్ధితుల్లోనూ జగన్ను తిరిగనీయకూడదన్నది ప్రభుత్వం పట్టుదల. తిరిగితీరాలనేది జగన్ పంతం. దాంతో ఏ క్షణంలో ఏమి జరుగుతుందోనని రాజధాని ప్రాంత గ్రామాల్లో టెన్షన్ పట్టుకున్నది. అమరావతి నిర్మాణం పేరుతో ప్రభుత్వం దాదాపు రెండేళ్ళ క్రితమే సుమారు 35 వేల ఎకరాలను సమీకరించింది. దాంతో రైతులకు వ్యవసాయం పూర్తిగా దెబ్బతన్నది. అటు ప్రత్యామ్నాయ ఉపాధీ లేకుండాపోయింది. దాంతో రైతు కుటుంబాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి.

ఈ విషయాలన్నింటిపై రైతులతో కలిసి చర్చించాలని జగన్ అనుకున్నారు. తన పర్యటనకు సంబంధించిన ముందస్తు సమాచారం కూడా జగన్ పోలీసులకు అందచేసారు. దాంతో ప్రభుత్వంలో ఆందోళన మొదలైంది. అప్పటి నుండి జగన్ పర్యటనలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. మంత్రులు రాజధాని గ్రామాల్లో తిరుగుతూ జగన్ పర్యటనకు సహకరించవద్దని హెచ్చరిస్తున్నారు. మంత్రులు పలు గ్రామాల్లో తిరుగుతూ జగన్ సభకు సహకరించవద్దని చెప్పటంతో రైతులు మంత్రులకు ఎదరుతిరిగారు. దాంతో పై ప్రాంతంలో ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడ్డాయి. జగన్ పర్యటన జరగకుండా చూసేందుకు మంత్రులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇదంతా చూస్తున్న వారికి ప్రభుత్వం బాగా అతిచేస్తోందనే అనిపిస్తోంది.

రాజధాని ప్రాంత గ్రామాల్లో జగన్ పర్యటస్తున్నారంటే ప్రభుత్వం ఎందుకు ఇన్ని ఆంక్షలు పెడుతున్నదో ఎవరికీ అర్ధం కావటం లేదు. ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి తర్వాతి స్ధానం జగన్దే. పైగా జగన్ కు క్యాటినెట్ మంత్రిహోదా కూడా ఉంది. అటువంటిది ప్రభుత్వం చేస్తున్న ఓవర్ యాక్షన్ చూస్తున్న సామాన్యులు ఆశ్చర్యపోతున్నారు.మొన్నటిమొన్నటి కాపు నేత ముద్రగడ పడ్మనాభం పాదయాత్ర చేయాలంటే ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. పైగా హౌస్ అరెస్ట్ కూడా చేసారు. ఇదంతా చూస్తుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తారనుకున్న ఎవరికీ ఎటువంటి అనుమతులూ ఇవ్వకూడదని ప్రభుత్వం అనుకున్నట్లే కనబడుతోంది.