‘బట్ట కాల్చి మొహం మీదేయటం’లోను ‘కిందపడ్డా నాదే పై చేయనటం’లోనూ చంద్రబాబునాయుడును మించిన నేత  దేశం మొత్తం మీద ఎవరు కనబడరు. అదే విధంగా బయటకు కనబడకుండా ఏదో సీక్రెట్ మిషన్ ఆపరేషన్ చేస్తూనే అదే మిషన్ ను ఇంకోరు చేస్తున్నట్లు ఆరోపణలతో ముంచెత్తగలరన్న విషయం తాజాగా బయటపడింది.

బిజెపితో తాను సయోధ్య కుదుర్చుకుంటున్న విషయం తాజాగా వెలుగు చూసింది. అదే సమయంలో బిజెపితో జగన్ లాలూచీ పడ్డారని, పవన్ లాలూచీ రాజకీయాలు చేస్తున్నారంటూ ఆరోపణలుతో ఊదరగొట్టేస్తున్నారు. ఎన్డీఏలో నుండి టిడిపి బయటకు వచ్చే ముందు నుండే ఓ పథకం ప్రకారం బిజెపి-వైసిపి ఒకటవుతున్నాయంటూ టిడిపి మద్దతుగా నిలబడే మీడియాలో విపరీతంగా ప్రాచారం చేయించారు.

అదే విషయాన్ని చంద్రబాబు మొదలు క్రిందిస్దాయి నేతల వరకూ పదే పదే ఊదరగొట్టించారు మీడియాలో. కానీ చివరికేమైంది? టిడిపికి బాగా మద్దతుగా నిలిచే ఓ మీడియాలోనే బిజెపి-చంద్రబాబు మద్య రాజీ చర్చలు జరుగుతున్నట్లు మొదటి పేజీలోనే వచ్చింది. సరే, రాజీ చర్చలు ఎంత వరకూ ఫలప్రదమవుతాయి? చంద్రబాబు తిరిగి ఎన్డీఏ గూటికి చేరుతారా? అన్నది వేరే సంగతి.

నిజానికి చంద్రబాబును తిరిగి ఎన్డీఏ గూటిలోకి రానిచ్చేట్లయితే అసలు బయటకు వెళ్ళే పరిస్ధితి కల్పించేవారే కాదు కదా? ఎన్డీఏలో చంద్రబాబు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని ప్రధానమంత్రి నరేంద్రమోడి అనుకున్నారు. కాబట్టి ఎన్డీఏలో నుండి చంద్రబాబు బయటకు వెళ్ళిపోతానంటే ఏమాత్రం ఖాతరు చేయలేదు.

అదే సమయంలో చంద్రబాబు అవినీతిపరుడంటూ బిజెపి రాష్ట్రస్ధాయిలో పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టేసింది. అదే నిజమైతే మళ్ళీ బిజెపి-చంద్రబాబు మధ్య రాజీ చర్చలేంటి? ఇక్కడ మ్యాటర్ వెరీ క్లియర్ గా అర్ధమైపోతోంది. ఎన్డీఏలో నుండి చంద్రబాబు బయటకు వచ్చేసిన దగ్గర నుండి  కేసుల భయం వెంటాడుతోంది. ఆ విషయం చంద్రబాబు అసెంబ్లీ ప్రసంగంలో బయటపడింది. అందుకనే బహుశా చంద్రబాబే బిజెపితో రాజీ చర్చలకు ప్రతిపాదించారనే ప్రచారం కూడా మొదలైంది.