చంద్రబాబునాయుడును పొగడటంలోను, ఉబ్బేయటంలో మంత్రులు ఒక్కోసారి తప్పటడుగులు వేస్తున్నారు. ఆదివారం చిత్తూరులో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అదే పని చేసారు.
చంద్రబాబునాయుడును పొగడటంలోను, ఉబ్బేయటంలో మంత్రులు ఒక్కోసారి తప్పటడుగులు వేస్తున్నారు. ఆదివారం చిత్తూరులో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అదే పని చేసారు. మీడియాతో మాట్లాడిన మంత్రి చంద్రబాబును బ్రహ్మాండంగా పొగుడుతున్నానుకుని నేలబారుకు దింపేసారు. ఇంతకీ మంత్రి ఏమన్నారంటే, పిచ్చిపట్టి జగన్ పాదయాత్ర చేస్తున్నారట. జగన్ ఆరాటమంతా సిఎం కుర్చీ కోసమేనంటూ మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో జగన్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని జోస్యం కూడా చెప్పేసారు. చివరగా, జగన్ పాదయాత్ర చేయటమంటే ‘పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్లే’ అంటూ ఎద్దేవా కూడా చేసారండోయ్.
ఇక్కడే దేవినేని ఓ విషయం మరచిపోయారు. సిఎం కుర్చీ కోసమే జగన్ పాదయాత్ర చేసేట్లయితే, మరి చంద్రబాబు చేసిన పాదయాత్ర కూడా సిఎం కుర్చీ కోసమే అని ఒప్పుకున్నట్లే కదా? సరే, జగన్ కు వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా వస్తుందా రాదా అన్నది భవిష్యత్తులో తేలుతుంది. ఇక, చివరగా పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవటమన్నదే విచిత్రంగా ఉంది.
చంద్రబాబును చూసి జగన్ పాదయాత్ర చేస్తున్నారు అని దేవినేని ఎద్దేవా చేసారు. ఇక్కడే మంత్రి మరచిపోయిన విషయమేంటంటే, చంద్రబాబుకన్నా ముందు పాదయాత్ర చేసింది వైఎస్సార్ అన్న విషయాన్ని. చంద్రబాబుని చూసి జగన్ పాదయాత్ర చేస్తున్నాడన్నదే నిజం అనుకుందాం. మరి చంద్రబాబు పాదయాత్ర చేసింది కూడా వైఎస్సార్ ను చూసేనా? అప్పుడు వైఎస్ పులైతే చంద్రబాబు కూడా నక్కే అని ఒప్పుకున్నట్లే కదా ?
