చంద్రబాబునాయుడుకు ఫిరాయింపు ఎంఎల్ఏలు షాక్ ఇవ్వనున్నారా? పలువురు ఫిరాయింపు ఎంఎల్ఏలు వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అపాయిట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారని సమాచారం. జగన్ తో భేటీకి అవకాశం కల్పించాల్సిందిగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని కొందరు ఫిరాయింపులు కోరినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. దాంతో ఈనెల 23న జరుగనున్న రాజ్యసభ ఎన్నికలు ఉత్కంఠగా మారింది.

ఫిరాయింపుల తాజా వ్యవహారంతో చంద్రబాబుకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయట. బిజెపితో సంబంధాలు ఏ మలుపు తిరుగుతాయో అన్న టెన్షన్ ఒకవైపు వెంటాడుతోంది. ఈనెల 23వ తేదీన జరుగనున్న రాజ్యసభ ఎన్నికల్లో మూడో సీటుపై ఏం నిర్ణయం తీసుకోవాలో తేల్చుకోలేకపోతున్నారు. ఇంతలో హటాత్తుగా ఫిరాయింపు ఎంఎల్ఏల రూపంలో చంద్రబాబుకు కొత్త తలనొప్పులు మొదలవుతున్నాయని సమాచారం.

ఇంతకీ విషయం ఏమిటంటే, వైసిపి నుండి టిడిపిలోకి ఫిరాయించిన 22 మంది ఎంఎల్ఏల్లో అందరూ కంఫర్టబుల్ గా లేరు. నలుగురు ఫిరాయింపు మంత్రులను వదిలేస్తే మిగిలిన 18 మందిలో మెజారిటీ ఎంఎల్ఏల పరిస్ధితి దయనీయంగా ఉంది. టిడిపిలోకి ఎందుకు ఫిరాయించామా అని వారిలో వారే మదనపడుతున్నారు.

పేరుకే వారు టిడిపి ఎంఎల్ఏలుగా ఉన్నా ప్రభుత్వంలో ఒక్కపని కూడా కావటం లేదు. పార్టీలో సీనియర్ నేతలు వారిని కలుపుకోవటం లేదు. తమ సమస్యలు చెప్పుకోవాలంటే చంద్రబాబు అపాయిట్మెంట్ దొరకటం లేదు. దాంతో వారిలో తీవ్ర అసంతృప్తి పేరుకుపోతోంది. అందుకనే వారిలో పలువురు తిరిగి వైసిపిలోకి వెళిపోతే ఎలాగుంటుందనే చర్చ జరుగుతోంది. ఆమధ్య కోడుమూరు ఫిరాయింపు ఎంఎల్ఏ మణిగాంధి చేసిన ప్రకటనే అందుకు సాక్ష్యం.

దానికితోడు ఫిరాయింపులు తిరిగి వైసిపిలోకి వస్తే తీసుకుంటామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన విషయం అందరకీ తెలిసిందే. దాన్ని అవకాశంగా తీసుకున్న ఫిరాయింపుల్లో పలువురు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డితో టచ్ లోకి వెళ్ళారట. అంతకుముందు ఓ పదిమంది అత్యవసరంగా సమావేశమై తమ భవిష్యత్ పై చర్చించుకున్నారట.

మొత్తానికి ఈ విషయం  టిడిపి నేతల దృష్టిలో పడటంతో వెంటనే చంద్రబాబు చెవిన వేశారట. దాంతో చంద్రబాబులో కొత్త టెన్షన్ మొదలైందట. రాజ్యసభ ఎన్నికల్లో జగన్ ను దెబ్బ కొట్టేందుకు వీలైనంతమందిని ఫిరాయింపులకు ప్రోత్సహించాలని ఒకవైపు ప్లాన్ చేస్తున్నారు. ఇంతలో ఊహించని రీతిలో ఫిరాయింపుల్లో కొందరు జగన్ అపాయిట్మెంట్ కోసం ట్రై చేస్తున్న విషయం బయటపడింది.  దాంతో రాజ్యసభ ఎన్నికల్లో చంద్రబాబుకు కొత్త తలనొప్పులు తప్పవంటూ ప్రచారం మొదలైంది.