Ayodhya Ram Mandir: అయోధ్యలోని నూతనంగా నిర్మించిన మందిరంలో బాలరాముడు కొలువుదీరాడు. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా సోమవారం నాడు  రామ్ లలా ప్రాణ ప్రతిష్ఠ క్రతువు వైభవంగా జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కాకపోవడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  

Ayodhya Ram Mandir: అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. దాదాపు 500 ఏళ్ల హిందువుల కలను సాకారమైంది. రామజన్మభూమిలో నూతనంగా నిర్మించిన మందిరంలో బాలరాముడు కొలువుదీరాడు. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా సోమవారం నాడు రామ్ లలా ప్రాణ ప్రతిష్ఠ క్రతువు వైభవంగా జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి దేశంలోని సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ తరుణంలో ఏపీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌లు ఈ వేడుకు హాజరయ్యారు. ఆదివారం మధ్యాహ్నం ఇరువురూ అయోధ్యకు బయలుదేరుతారు. ఇవాళ రాత్రికి అక్కడే బస చేసి.. సోమవారం రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇద్దరు నేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతుండడంతో బీజేపీతో పొత్తులపై రాజకీయ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.

మరోవైపు, ఈ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కాకపోవడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి రామమందిర ప్రతిష్ఠ మహోత్సవానికి దాదాపు 8 వేల మంది అతిథులను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానించినట్టు తెలుస్తోంది. వీరిలో సినీ తారలు, రాజకీయ నాయకులు, పీఠాధిపతులు, సాధువులు ఉన్నారు. అయితే, ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలు మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇంతకీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కేంద్రం నుంచి కానీ, నిర్వాహకుల నుంచి కానీ ఆహ్వానం అందిందా? లేదా ? అనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. 

మరోవైపు.. వచ్చే ఎన్నికలకు అభ్యర్థుల జాబితాలను ఖరారు చేసే పనిలో ఆయన బిజీగా ఉన్నారని, అధికారికంగా కార్యక్రమాలు ఉన్నాయని సీఎంఓ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి జగన్ కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయనీ చెప్పాలి.

వైసీపీ పార్టీ కీలక నాయకులు వి.విజయసాయిరెడ్డి లాంటి వారు రామమందిర ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకటనలు చేయడంతో కేంద్రం కూడా జగన్‌కు ఆహ్వానం పలికి ఉంటుందని అంతా అనుకున్నారు. “బహుశా .. జగన్ క్రైస్తవ విశ్వాసం కారణంగా.. ఆయన అయోధ్యకు వెళ్లడానికి ఇష్టపడకపోవచ్చు. అదే సమయంలో మైనారిటీ ఓట్లను గల్లంతవుతాయనీ, ప్రారంభోత్సవానికి దూరంగా ఉంటే.. బీజేపీకి మరింత దూరమయ్యారు“ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ఏదిఏమైనా.. అయోధ్య ఆహ్వానం అందుకున్న నాయుడు ఇప్పటికే బీజేపీ కూటమి భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తో కలిసి ఆదివారం అయోధ్యకు బయలుదేరారు. వీరిద్దరికీ మోదీని కలిసే అవకాశం ఉందని సమాచారం.