Asianet News TeluguAsianet News Telugu

సీఎం జగన్ ట్రాప్‌లో చిరంజీవి.. మాస్టర్ ప్లాన్‌తో వాటన్నింటికి చెక్ పడినట్టేనా..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి గురువారం భేటీ అయ్యారు. అయితే ఈ భేటీపై ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త చర్చ సాగుతుంది. చిరంజీవికి రాజ్యసభ అని కథనాలు రావడం.. వాటిని ఆయన ఖండించడం జరిగింది. ఈ పరిణామాల వెనక జగన్ మాస్టర్ ప్లాన్‌ ఉన్నట్టుగా చర్చ సాగుతుంది. 

is chiranjeevi fall in ys jagan trap What happened
Author
Hyderabad, First Published Jan 14, 2022, 6:38 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి గురువారం భేటీ అయ్యారు. అయితే ఈ భేటీపై ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త చర్చ సాగుతుంది. సినీ పరిశ్రమ సమస్యలపై మాట్లాడేందుకు తాను సీఎం జగన్ పిలుపుమేరకు వచ్చి కలిసినట్టుగా సమావేశం అనంతరం చిరంజీవి చెప్పారు. సినీ పరిశ్రమ సమస్యలను ఆయనకు వివరించానని తెలిపారు. సినీ పరిశ్రమకు ఒక బిడ్డగానే తానిక్కడికి వచ్చానని అన్నారు. సీఎం సానుకూలంగా తాను చెప్పిన సమస్యలను విన్నారని.. తర్వలోనే అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం ఉంటుందని చెప్పారు. త్వరలోనే శుభవార్త వింటారని తెలిపారు. దీంతో సినీ పరిశ్రమతో పాటుగా, చాలా మంది గత కొంతకాలంగా కొనసాగుతున్న వివాదంపై సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నట్టుగా చెప్పారు.

అయితే తెల్లారేసరికే సీన్ మారిపోయింది. చిరు-జగన్ భేటీలో సినీ పరిశ్రమ సమస్యలతో పాటు రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చాయని ఓ ప్రముఖ ఆంగ్ల ప్రతికలో కథనం వచ్చింది. చిరంజీవికి జగన్ రాజ్యసభ ఆఫర్ చేసినట్టుగా సీఎం కార్యాలయం సన్నిహిత వర్గాలు చెప్పటినట్టుగా ఆ కథనంలో పేర్కొన్నారు. దీంతో ఈరోజు ఉదయం నుంచి చిరంజీవి రాజ్యసభ సీటు కోసమే జగన్‌ను కలిశారా అనే చర్చ.. పొలిటికల్ సర్కిల్స్‌తో పాటుగా సోషల్ మీడియాలో విపరీతంగా సాగుతుంది. ఈ క్రమంలోనే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు చేసిన కామెంట్స్‌ కూడా చర్చనీయాంశంగా మారాయి. చిరంజీవిని అల్లరి చేసేవిధంగా ఆయన రాజ్యసభ అవకాశం ఇస్తున్నట్లు వైసీపీ శ్రేణులు కావాలనే వార్తలు రాయించారని ఆరోపించారు. దీంతో ఒక్కసారిగా చిరంజీవి, జగన్ భేటీలో అసలేం జరిగిందనేది మరింత చర్చనీయాంశంగా మారింది. 

ఇదిలా ఉంటే.. సీఎం జగన్‌తో చిరంజీవి భేటీకి ముందు ఏపీ ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్‌గా చోటుచేసుకన్న పరిణామాలను కొందరు ప్రస్తావిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరలపై తీసుకొచ్చిన జీవోపై, అదనపు షోలకు అనుమతి నిరాకరించడం సహా ఏపీ ప్రభుత్వం చేపట్టిన పలు చర్యలను సినీ రంగంలోని కొందరు తప్పుబడుతున్నారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్, నాని చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రుల నుంచి తీవ్రమైన రియాక్షన్ వచ్చింది. అయితే సడన్‌గా రామ్‌గోపాల్ వర్మ తెరమీదకు చ్చారు. వర్మ,  మంత్రి పేర్ని నాని మధ్య ట్విట్టర్ వార్ జరగడం.. వర్మ వెళ్లి పేర్ని నానిని కలవడం జరిగింది. ఆ తర్వాత కూడా వర్మ ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సందిస్తూనే ఉన్నారు. 

ఇవన్నీ పక్కనబడితే.. వైసీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ నుంచి గట్టిగానే స్పందన వచ్చింది. సినీ పరిశ్రమపై వైసీపీ నుంచి వస్తున్న వ్యాఖ్యలకు ఏ మాత్రం స్పందించని సినీ పరిశ్రమ వర్గాలు.. ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆయనపై ఎదురుదాడికి దిగాయి. నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, తమ్మారెడ్డి భరద్వాజ వంటివారు ఘాటుగానే స్పందించారు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా నల్లపరెడ్డి కామెంట్స్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. మరోవైపు తన అఖండ సక్సెస్ మీట్‌లో మాట్లాడిన నందమూరి బాలకృష్ణ.. సినిమా టికెట్ల వివాదంపై స్పందిస్తూ ఏపీలో పట్టించుకునే నాథుడే లేడంటూ కామెంట్స్ చేశారు. 

కట్ చేస్తే మెగాస్టార్ చిరంజీవికి వైఎస్ జగన్ నుంచి ఆహ్వానం అందడం.. ఇరువురి భేటీ కావడం జరిగింది. సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ కానున్నారనే విషయం.. గురువారం ఉదయం వరకు కూడా ఎవరికి తెలియదు. ఇద్దరు లంచ్‌‌కు మీట్ అవుతారని ఉదయం నుంచి ప్రచారం జరిగింది. అనుకున్నట్టుగానే భేటీ జరిగింది. అయితే ఇక్కడే వైసీపీ చాలా తెలివిగా వ్యవహరించందనే టాక్ ఒకటి పొలిటికల్ సర్కిల్స్‌‌లో వినిపిస్తోంది. నల్లపురెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో ఇండస్ట్రీ నుంచి వస్తున్న వ్యతిరేకకు చిరు భేటీతో పుల్ స్టాప్ పడినట్టయింది. మరోవైపు చిరంజీవి రాజ్యసభ అంశం తెరమీదకకు వచ్చింది. దీంతో ఇప్పుడు గత నాలుగైదు రోజులుగా దుమారం లేపిన అంశం పక్కకు పోయినట్టయింది. 

చిరంజీవి వైసీపీ ట్రాప్‌లో పడ్డారా..?
చిరంజీవి కొన్ని రోజుల క్రితం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీ పెద్దగా ఉండటం తనకు అసలు ఇష్టం లేదని అన్నారు. పెద్దరికం హోదా తనకు ససేమిరా ఇష్టం లేదని చెప్పారు. కానీ బాధ్యత గల బిడ్డగా ఉంటానని తెలిపారు. అయితే ఈ చిరు ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే జగన్ బంధువైన మోహన్‌బాబు.. సినిమా ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు, నలుగురు ప్రొడ్యూసర్స్, నలుగురు డిస్ట్రిబ్యూటర్స్ కాదు.. కొన్ని వేలమంది ఆశలు, కొన్ని వేల కుటుంబాలు అంటూ ఓ లేఖ విడుదల చేశారు. ఇరువురు ముఖ్యమంత్రులను గౌరవించుకోవాలని, మన పరిశ్రమ సమస్యలను విన్నవించుకోవాలని తెలిపారు.

అయితే తాజాగా జగన్ నుంచి ఆహ్వానం అందడంతో చిరు తాడేపల్లికి చేరుకున్నారు. అయితే ఈ భేటీకి ముందు, తర్వాత మీడియాతో మాట్లాడిన చిరంజీవి.. తాను పెద్దగా రాలేదని, ఇండస్ట్రీ బిడ్డగా మాత్రమే వచ్చానని పదే పదే చెప్పుకొచ్చారు. అయితే ఈ భేటీ తర్వాత చోటుచేసున్న పరిణామాలు గమనిస్తే మాత్రం జగన్ మాస్టర్ ప్లాన్‌తో ఒకేసారి.. పలువురికి చెక్ పెట్టాడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సినిమా టికెట్ల రేట్లపై టాలీవుడ్ నుంచి విమర్శలు రాకుండా చేసుకున్నారు. అంతేకాకుండా చిరంజీవి‌తో భేటీలో ఏం చర్చించారనే దానిని ఓ ప్రశ్నగా మార్చారు. దీంతో సీఎం జగన్ ట్రాప్‌లో చిరంజీవి పడ్డారనే గుసగుసలు మాత్రం గట్టిగానే వినిపిస్తున్నాయి. 

పవన్‌కు చెక్..
చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. అంతేకాకుండా చంద్రబాబుతో పొత్తుకు కూడా పవన్ కల్యాణ్ సంకేతాలు ఇచ్చినట్లుగా చర్చ సాగుతుంది. చంద్రబాబు అయితే జనసేనతో కలిసేందుకు సిద్దంగా ఉన్నట్టు బహిరంగంగానే సంకేతాలు పంపారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు రాష్ట్రంలో 20 నుంచి 25 శాతం వరకు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు పవన్ కల్యాణ్ మద్దతు ఇవ్వడం వల్లనే వైసీపీ ఓటమి పాలైందనే అంచనాలు ఉన్నాయి. ఈ విషయాన్ని చంద్రబాబు స్వయంగా చెప్పారు. 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ జనసేన ఒంటరిగా పోటీ చేయడం కూడా జగన్ కు కలిసి వచ్చింది. ఈ దృష్ట్యా వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రాబల్యాన్ని తగ్గించడానికి జగన్ వ్యూహరచన చేసినట్లు భావించాల్సి ఉంటుంది.

కాపుల్లో కలవరం..
వైఎస్ జగన్ అధికారంలోకి రాకముందు.. కాపులకు పలు హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే వాటిని నెరవేర్చలేదని కొందరు కాపు నేతలు గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలోనే వైసీపీ మినహా ఏపీలోని ప్రముఖ కాపు నాయకులు.. వరుసగా భేటీలు కావడం చర్చనీయాంశంగా మారింది. కాపులతో పాటు అధికారినికి దూరంగా బలహీన వర్గాలను కలుపుకుని పోవాలని కాపు నేతలు దృష్టి సారించినట్టుగా ప్రచారం సాగింది. ఇటీవల చంద్రబాబు కూడా చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే చిరంజీవి రాజ్యసభ ఇస్తారనే ప్రచారం నేపథ్యంలో.. కొంతకాలంగా కాపుల ఏకీకరణ కోసం ప్రయత్నాలు చేస్తున్న నేతల్లో మాత్రం ఈ పరిణామాలు కలకలం రేపుతున్నాయి. 

చిరు నుంచి ఖండన వచ్చిన ఫలితం లేదా..?
చిరంజీవి సినీ పరిశ్రమ సమస్యలు చర్చించేందుకు వచ్చనానని చెప్పిన.. ఇరువురు నేతల మధ్య వన్ టూ వన్ భేటీ జరగడంతో అసలు సమావేశంలో ఏం జరిగిందనేదానిపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ సాగుతుంది. కొందరైతే చిరంజీవి సీఎం జగన్‌ను ఒప్పించి తనతో పాటు మరికొందరు సినీ పెద్దలను కూడా ఈ భేటీ తీసుకెళ్లాల్సి ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు.టాలీవుడ్ నుంచి అటువంటి విమర్శలు వినిపించకపోయిన..అందరిని కలుపుకుపోవాలంటూ మోహన్ బాబు గతంలో చేసిన కామెంట్స్‌ను కొందరు ప్రస్తావిస్తున్నారు.

చిరంజీవి శుక్రవారం సాయంత్రం రాజ్యసభ టికెట్ అని వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని.. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నట్టు ప్రకటించారు. ఏది ఏమైనా చిరంజీవితో భేటీ వెనక జగన్ పెద్ద ప్లానే వేశారని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతుంది. జగన్ ట్రాప్‌లో చిరంజీవి పడ్డారని.. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ భేటీ జగన్‌‌కు కలిసివచ్చిందనే టాక్‌ వినిపిస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios