చంద్రబాబునాయుడు సొంత నిర్ణయాలు తీసుకునే శక్తి కోల్పోయారా?

వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బిగిస్తున్న ఉచ్చులో ఇరుక్కున్నారా?

రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తుంటే అందరిలోనూ ఇదే అనుమానం మొదలైంది. జగన్, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆడుతున్న మైండ్ గేమ్ లో చంద్రబాబు ఇరుక్కున్నట్లు స్పష్టంగా అర్ధమవుతోంది. మూడు రోజుల నుండి చంద్రబాబు పదే పదే సిబిఐ విచారణ గురించి ప్రస్తావిస్తుంటూనే ఎంత టెన్షన్ పడుతున్నారో అర్ధమవుతోంది.

మామూలుగా అయితే పావులు కదపటంలోను, ప్రత్యర్ధులకు ఉచ్చు బిగించటంలోనూ చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటారు. అటువంటిది గడచిన మూడున్నరేళ్ళుగా పదే పదే తప్పులు చేస్తూ జగన్ కు అస్త్రాలను తనంతట తానే ఎందుకు అందిస్తున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు. దాంతో జగన్, విజయసాయి చంద్రబాబుపై మైండ్ గేమ్ కు తెరలేపారు.

కేంద్రమంత్రివర్గంలో నుండి తప్పుకోవటం, తర్వాత ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేయటం వైసిపి మైండ్ గేమ్ లో భాగమే అని అర్ధమవుతోంది. తాజాగా చంద్రబాబు, లోకేష్ పై సిబిఐ విచారణ, కేసులంటూ రాజ్యసభ సభ్యుడు ఆరోపణలతో హోరెత్తించేస్తున్నారు.

ఇక్కడ కూడా వైసిపి ఒత్తిడికి చంద్రబాబు తలొంచినట్లే కనబడుతోంది. ఎందుకంటే, రెండు రోజులుగా చంద్రబాబు పదే పదే పట్టిసీమలో అవినీతి, సిబిఐ విచారణ, కేసులంటూ అంటూ ప్రస్తావిస్తున్నారు. కేంద్రానికి భయపడేది లేదంటూ హెచ్చరికలు చేస్తూన్నారు. అదే సమయంలో తనపై దాడి చేయటమంటే, రాష్ట్ర ప్రజలపై దాడి చేయటమే అంటూ సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే మొత్తానికి వైసిపి మైండ్ గేమ్ కు చంద్రబాబు తలొంచినట్లే కనబడుతోంది.