పార్లమెంటులో గందరగళం సృష్టించే పార్టీలు, ఎంపిలపై సస్పెన్షన్ వేటు వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 5వ తేదీ నుండి పార్లమెంటు బడ్జెట్ రెండో సెషన్ మొదలవుతున్న విషయం అందరకీ తెలిసిందే. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపి ప్రస్తావన కనీసమాత్రంగా లేకపోవటంతో హీట్ పెరిగిన విషయం అందరికీ తెలిసిందే.

కేంద్ర బడ్జెట్ పై జనాలు మండిపోయిన నేపధ్యంలో టిడిపి, వైసిపి ఎంపిలు కూడా పార్లమెంటులో గందరగోళం సృష్టించారు. సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. పార్లమెంటు లోపలా బయట కూడా నిరసనలు, ఆందోళనలతో హోరెత్తించారు. సరే, మొత్తానికి మొదటి సెషన్ ముగిసి ఎల్లుండి నుండి రెండో సెషన్ మొదలవుతోంది.

రెండో సెషన్లో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై టిడిపి, వైసిపిలు ఇప్పటికే నిర్ణయించాయి. సభా కార్యక్రమాలను అడ్డుకోవాలని గట్టిగా తీర్మానం చేసుకున్నాయి. ఈ నేపధ్యంలోనే ఏపి ఎంపిల వ్యూహానికి బిజెపి విరుగుడు కనిపెట్టిందట. సభా కార్యక్రమాలను అడ్డుకునే ఎంపిలను సస్పెండ్ చేయాలని బిజెపి నాయకత్వం నిర్ణయించిందట.

ఏపి అభివృద్ధికి ఓ ప్రకటన చేయాలని, అప్పటికీ ఎంపిలు వినకపోతే సస్పెండ్ చేయటమొకటే మార్గమని కూడా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రికి ప్రధానమంత్రి, జాతీయ అధ్యక్షుడు ఆదేశించారట. అంటే ఏపి ఎంపిల నిరసనలు, ఆందోళనలను బిజెపి అణిచివేయాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది. 

వైసిపి ఎంపిలు సస్పెండ్ అవటం ఒకఎత్తు. అదే టిడిపి ఎంపిలు కూడా పార్లమెంటు నుండి సస్పెండ్ అవ్వటమంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే, కేంద్రప్రభుత్వంలో టిడిపి కూడా భాగస్వామన్న విషయం అందరికీ తెలిసిందే. సస్పెండ్ చేయాలన్న బిజెపి నిర్ణయం అమల్లోకి వస్తే  అపుడు బిజెపితో పొత్తుల విషయంలో చంద్రబాబునాయుడు ఏమి నిర్ణయం తీసుకుంటారో చూడాలి?