వచ్చే ఎన్నికల్లో కర్నూలు జిల్లా రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయా? పార్టీ వర్గాలు చెబుతున్న ప్రకారం అవుననే సమాధానం వస్తోంది. ప్రస్తుతం ఆళ్ళగడ్డ నుండి ఎంఎల్ఏగా ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి భూమా అఖిలప్రియ వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు దక్కేది అనుమానమేనట. కాదు కూడదంటే నంద్యాల ఎంపిగా పోటీ చేయిస్తారట. అఖిలప్రియ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలంటే ఇష్టం ఉన్నా లేకపోయినా ఎంపిగా పోటీ చేయక తప్పదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అఖిల మీదకానీ నంద్యాల ఎంఎల్ఏగా ఉన్న భూమా బ్రహ్మానందరెడ్డి మీదగాని చంద్రబాబునాయుడుకు ఏమంత సదభిప్రాయం లేదట. మంత్రి వ్యవహారశైలి మొదటి నుండి వివాదాస్పదమే. పనితీరు కూడా పెద్దగా బావోలేదు. దానికితోడు జిల్లాలోని ఎవరితోనూ సఖ్యత లేదు. అయితే, నియోజకవర్గంలో తండ్రి భూమా నాగిరెడ్డి మృతి తాలూకు సెంటిమెంట్ మాత్రం ఉందని ప్రచారంలో ఉంది. అందుకనే అఖిలను భరించక తప్పటం లేదట.

అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో అఖిల గెలుపుపై అనేక అనుమానాలున్నాయి. అందుకనే ఆళ్ళగడ్డ నుండి అఖిల స్ధానంలో గంగుల ప్రతాపరెడ్డిని పోటీలోకి దింపాలని చంద్రబాబు అనుకుంటున్నారట. నంద్యాల ఎంఎల్ఏ భూమా బ్రహ్మానందరెడ్డి స్ధానంలో చంద్రబాబే పోటీ చేసే అవకాశం ఉందంటూ జిల్లాలో బాగా ప్రచారం జరుగుతోంది.

వచ్చే ఎన్నికల్లో కొడుకు నారా లోకేష్ కు సేఫ్ నియోజకవర్గాన్ని చూడటంలో భాగంగా కుప్పం నియోజకవర్గం నుండి లోకేష్ ను పోటీ చేయించి తాను నంద్యాలలో పోటీ చేయాలని అనుకుంటున్నట్లు జిల్లా నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఇంకెన్ని సమీకరణలు తెరపైకి వస్తాయో చూడాల్సిందే.