తమిళనాడులో ఏఐఏడిఎంకె శశికళ వర్గం తాజాగా మరో వివాదంలో ఇరుక్కుంది. దేశచరిత్రలో ఎన్నడూ లేని విధంగా పార్టీ చిహ్నం కోసం ఏకంగా ఎన్నికల కమీషన్ కే లంచం ఇవ్వచూపటమనే ఆరోపణల్లో పార్టీ ఇరుక్కున్నది. శశికళ మేనల్లుడు, పార్టీ డిప్యూటి సెక్రటరీ జనరల్ టిటివి దినకరన్ ఆరోపణలకు కేంద్రబిందువుగా మారారు. జయలలిత మరణం తర్వాత పార్టీ పగ్గాలను చేజిక్కించుకున్న శశికళ రోజురోజుకు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతుండటం గమనార్హం.

పార్టీలోని పన్నీర్ సెల్వం-శశికళ వర్గాల్లో పార్టీ చిహ్నమైన రెండాకులు గుర్తు ఎవరికి దక్కుతుందన్న వివాదం మొదలైంది. దాంతో ఇరు వర్గాలు ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసుకున్నాయి. ఒకవైపు ఇసిలో ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకంపై విచారణ జరుగుతుండగానే తాజా ఆరోపణలు చుట్టుముట్టటం విచిత్రం. ఒకవైపు శశికళ జైలు జీవితం, ఇంకోవైపు ఆర్కె నగర్ ఉప ఎన్నిక వాయిదా పడటం లాంటి వాటివల్ల శశికళ వర్గంపై  ప్రజల్లో వ్యతరేకత పెరిగిపోతోంది.

రెండాకుల గుర్తును సొంతం చేసుకునేందుకు దినకరన్ మధ్యవర్తి సుఖేష్ చంద్రన్ తో రూ. 60 కోట్లతో డీల్ కుదుర్చుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. డీల్ కుదుర్చుకున్న మధ్యవర్తి సుఖేష ను పోలీసులు విచారించగా తనకు, దినకరన్ కు మధ్య జరిగిన డీల్ విషయం బయటపెట్టినట్లు సమాచారం. దాంతో రూ. 1.3 కోట్లను పోలీసులు సుఖేష్ నుండి స్వాధీనం చేసుకున్నారు. అయితే, దినకరన్ మాత్రం తనకు మధ్యవర్తే తెలియదని బుకాయిస్తున్నారు.