అధికార టిడిపిలోని పలువురు ఎంఎల్ఏలు జనసేన వైపు చూస్తున్నారా? మారుతున్న రాజకీయ సమీకరణలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. మొన్నటి వరకూ రాష్ట్రంలో ప్రతిపక్షమంటే ఒక్క వైసిపినే చెప్పుకునే వారు. కానీ మొన్నటి 14వ తేదీ నుండి జనసేన గురించి కూడా మాట్లాడుకుంటున్నారు జనాలు.   

మొన్నటి 14వ తేదీ నుండి చంద్రబాబు విషయంలో మారిన పవన్ వైఖరితో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంకా చెప్పాలంటే మూడున్నరేళ్ళలో చంద్రబాబుపై పవన్ చేస్తున్న ఆరోపణలు జగన్ కూడా చేయలేదేమో? జనసేన ఆవిర్భావ దినోత్సవం సంగతి దేవుడెరుగు చంద్రబాబుకు పవన్ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. కేంద్రంతో సంబంధాలు చెడిపోయి ఎన్డీఏలో నుండి వచ్చేశారు. అంతుకుముందు నుండే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రతో హోరెత్తించేస్తున్నారు. మిత్రపక్షం బిజెపినే ప్రతిపక్షమైపోయింది అప్పటికే.

అటువంటి పరిస్ధితుల్లో ‘మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు’ చంద్రబాబుపై పవన్ కూడా ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడుతున్నారు. దాంతో ఏం చేయాలో చంద్రబాబుకు దిక్కుతోచటం లేదు.  40 మంది ఎంఎల్ఏలు తనతో టచ్ లో ఉన్నారంటూ తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలు కచ్చితంగా టిడిపిలో అలజడి రేపుతున్నాయనటంలో సందేహం అవసరం లేదు.

103 మంది ఎంఎల్ఏల్లో 40 మంది పవన్ తో టచ్ లో ఉండటమంటే మామూలు విషయం కాదు. రేపటి ఎన్నికల్లో తమకు టిక్కెట్లు రావు అని అనుకున్న ఎంఎల్ఏలు లేదా సీనియర్ నేతలూ వెంటనే జనసేనలోకి జంప్ చేసే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. సరే, వచ్చిన వాళ్ళల్లో ఎంతమందికి పవన్ టిక్కెట్లిస్తారు? ఎంతమంది గెలుస్తారన్నది వేరే సంగతి?

ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు వైసిపిలో చేరారు. పాదయాత్ర సందర్భంగా మరింత మంది నేతలు వైసిపిలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో టిడిపి నేతలను పార్టీలో చేర్చుకోవాలని బిజెపి కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇంతలో పవన్ పెద్ద బాంబే పేల్చారు.  సరే, ఇన్ని సమస్యలకు అదనంగా ఫిరాయింపు ఎంఎల్ఏల సమస్య ఉండనే ఉంది. మరి, ఈ సమస్యలన్నింటినీ చంద్రబాబు ఎలా ఫేస్ చేస్తారో చూడాల్సిందే.?