విజయవాడ: సీనియర్ ఐపీఎస్ అధికారి నరసింహులు బాలసుబ్రమణ్యంను  ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఏపీ ప్రభుత్వం బుధవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. బాలసుబ్రమణ్యంను బదిలీ చేయడం వెనుక కారణాలు ఏమిటనే విషయమై సర్వత్రా చర్చ సాగుతోంది.

014-2019 మధ్య కాలంలో ఐపీఎస్ బాలసుబ్రమణ్యం రవాణ శాఖ కమిషనర్‌గా పనిచేశారు. ఈ  సమయంలో విజయవాడ ఎంపీ కేశినేని నానితో పాటు విజయవాడకు చెందిన టీడీపీ ప్రజా ప్రతినిధులు ఓ ప్రైవేట్ ట్రావెల్స్  బస్సుల  విషయంలో గొడవకు దిగారు.

ఈ సమయంలో ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌ కార్యాలయంలో పనిచేసే ఓ హోంగార్డుపై దురుసుగా  మాట్లాడారనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు రావడంతో ఆ సమయంలో విజయవాడ ఎంపీ కేశినేని నానితో పాటు టీడీపీ ప్రజా ప్రతినిధులతో చంద్రబాబునాయుడు రవాణ శాఖ కమిషనర్‌గా ఉన్న బాలసుబ్రమణ్యంకు క్షమాపణలు చెప్పారు.

ఎన్నికల ఫలితాల తర్వాత పార్లమెంట్‌లో టీడీపీ విప్ పదవి తనకు వద్దని నాని సోషల్ మీడియా వేదికగా చెప్పిన సమయంలో  బాలసుబ్రమణ్యంకు తనతో క్షమాపణ చెప్పిన అంశాన్ని కూడ ప్రస్తావించారు.

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఎన్నికలకు ముందు ఏపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి చెందిన కీలక సమాచారాన్ని తస్కరించారనే విషయమై ఫిర్యాదు చేసింది.ఈ విషయమై ఏర్పాటు చేసిన సిట్‌కు బాలసుబ్రమణ్యం నేతృత్వం వహించారు.

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన బాలసుబ్రమణ్యం‌ను  రవాణ శాఖ కమిషనర్‌ పదవి నుండి  తప్పించారు. ఆర్టీజీఈ ప్రగతికి సీఈఓగా నియమించారు.  ప్రస్తుతం బాలసుబ్రమణ్యంను ఈ పదవి నుండి కూడ తప్పించారు. 

అంతేకాదు ఈ పదవి నుండి ఆయనను బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఇంకా ఎవరిని నియమించలేదు.ఐపీఎస్ బాలసుబ్రమణ్యంను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.