హాస్టల్ గదిలో ఒంటరిగా వున్న సమయంలో ఉరేసుకుని ఓ విద్యార్థిణి ఆత్మహత్యకు పాల్పడింది.
విజయవాడ: ఓ కార్పోరేట్ కాలేజీలో జూనియర్ ఇంటర్ చదువుతున్న విద్యార్థిణి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం హాస్టల్ గదిలో ఒంటరిగా వున్న సమయంలో యువతి ఈ అఘాయిత్యానికి పాల్పడింది.
వివరాల్లోకి వెళితే... కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం పునాదిపాడు చైతన్య కళాశాలలో జూనియర్ ఇంటర్ చదువుతోంది దాసరి లాస్య. అనంతపురం పట్టణానికి చెందిన ఈమె హాస్టల్లో వుంటోంది. అయితే బుధవారం సాయంత్రం ట్యూషన్ సమయంలో తోటి విద్యార్థులంతా బయటకు వెళ్లిపోగా రూంలో ఒంటరిగా వుండిపోయిన యువతి అఘాయిత్యానికి పాల్పడింది. గదిలోని సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
ఈ విషయాన్ని గుర్తించిన తోటి విద్యార్థులు హాస్టల్ నిర్వహకులకు సమాచారం అందించారు. వారు ఫిర్యాదు చేయడంతో కంకిపాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువతి మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.
