తిరుమలకు మెట్లదారిలో వెడుతూ ఇంటర్ విద్యార్థిని మృతి...
మెట్లదారిలో తిరుమలకు వెడుతూ ఓ విద్యార్థిని మృతి చెందింది. ఉన్నట్టుండి గుండె పట్టేసినట్లై.. కుప్పకూలి మరణించింది.
తిరుమల : ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనం కోసం వెళ్ళిన కుటుంబం విషాదంలో మునిగిపోయింది. మెట్టమార్గంలో తిరుమలకొండకు చేరుకుంటున్న ఓ విద్యార్థిని ఆకస్మికంగా మృతి చెందింది. కుటుంబీకులతో కలిసి సంతోషంగా వెంకన్న దర్శనానికి వచ్చిన ఆమె.. హఠాత్తుగా మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల రెడ్డి వారి వీధికి చెందిన నర్సిరెడ్డి, లక్ష్మీదేవి దంపతులు. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కూతుర్లు. శుక్రవారం తెల్లవారుజామున వీరి కుటుంబం.. మరి కొంతమంది బంధువులతో కలిసి ఓ వాహనంలో తిరుమల దర్శనానికి బయలుదేరారు. అక్కడికి చేరుకున్న తర్వాత ఉదయం మెట్ల మార్గంలో నడుచుకుంటూ కొండెక్కుతున్నారు. ఈ క్రమంలో నర్సిరెడ్డి, లక్ష్మీదేవి దంపతుల రెండో కూతురు దివ్య (18) వేగంగా మెట్లు ఎక్కింది.
Odisha Train Accident: ఏపీ సీఎం జగన్ సమీక్ష.. ఘటన స్థలానికి మంత్రి అమర్‌నాథ్ నేతృత్వంలో బృందం..!!
ఆ తర్వాత వెంటనే శీతలపానీయం తాగింది. దీంతో గుండె పట్టేసినట్లు అనిపించింది. వెంటనే అక్కడికక్కడే కుప్పకూలి, మృతి చెందింది. అది గమనించిన కుటుంబీకులు.. అందుబాటులో ఉన్న ప్రాథమిక చికిత్స కేంద్రానికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దివ్య ఇంటర్ కంప్లీట్ చేసింది. ఇంజనీరింగ్ లో చేరాలనే ప్రయత్నంలో ఉందని బంధువులు తెలిపారు.
ఇదిలా ఉండగా, మేలో ఇలాంటి ఘటనే ఛత్తీస్ గఢ్ లో వెలుగు చూసింది. ఛత్తీస్ గఢ్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన మేనకోడలి పెళ్లిలో సంతోషంగా డ్యాన్స్ చేస్తూ ఉన్నట్టుండి కుప్పకూలి పోయాడు. హార్ట్ ఎటాక్ రావడంతో మృతి చెందాడు. అతని పేరు దిలీప్. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ ఘటన రాజ్ నంద్ గావ్ జిల్లా డోంగర్ ఘర్ లో చోటు చేసుకుంది.
వేదికమీద వధూవరులతో కలిసి కొంతమంది నృత్యం చేస్తున్నారు. వధువు మేనమామ అయిన దిలీప్ కూడా వారితో కలిసి ఎంతో సంతోషంగా నృత్యం చేస్తున్నాడు. ఇంతలో ఆయనకు ఛాతిలో ఏదో తేడాగా అనిపించడంతో డ్యాన్స్ ఆపి వేదిక మీదే కూర్చున్నాడు. సెకన్లలో అలాగే వెనక్కి పడిపోయాడు. అది చూసిన మిగతావారు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు తేలింది. హార్ట్ ఎటాక్ వల్లే చనిపోయారని వైద్యులు తెలిపారు.
అప్పటివరకు ఎంతో సంతోషంగా పెళ్లి వేడుక జరుగుతున్న ప్రాంగణంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే, ఈ ఘటన మే 4- 5 మధ్య రాత్రి జరిగింది. ఈ ఘటన మొత్తం కెమెరాలో రికార్డయ్యింది. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.