Asianet News TeluguAsianet News Telugu

12 ఏళ్లుగా ప్రజాప్రతినిధులే అతని టార్గెట్: మాటలతో మాయ చేసి, కోట్లు వసూలు

ఎంపీ, ఎమ్మెల్యేలను సైతం అవలీలగా బురిడీ కొట్టించి 12 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల పోలీసులకు మస్కా కొట్టిస్తున్న నాయుడు అనే కేటుగాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

inter state cyber criminal naidu held at east godavari
Author
Amaravathi, First Published May 21, 2020, 3:02 PM IST

ఎంపీ, ఎమ్మెల్యేలను సైతం అవలీలగా బురిడీ కొట్టించి 12 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల పోలీసులకు మస్కా కొట్టిస్తున్న నాయుడు అనే కేటుగాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన తోట బాలాజీ నాయుడు బీటెక్ చదివి ఎన్‌టీపీసీలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తూ సైబర్ నేరాల బాట పట్టాడు. అనంతరం పాల్వంచ, కరీంనగర్ ఎన్టీపీసీలో పనిచేస్తున్న కాలంలో లంచం తీసుకుంటూ ఏసీబీ ట్రాప్‌కు చిక్కుకుని సస్పెండయ్యాడు.

2008లో జరిగిన ఏసీబీ ట్రాప్ తర్వాత నాయుడి మోసాల చిట్టా తెరుచుకుని నేరాల పరంపర మొదలైంది. అసలే మాటకారి కావడంతో పాటు ఇంగ్లీషులో ప్రావీణ్యత అతని మోసాలకు బాగా ఉపయోగపడ్డాయి. తానో ఉద్యోగినని పరిచయం చేసుకుంటాడు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన కొన్ని పథకాల పేర్లు చెప్పి ఈ విధులు ఇంకా ఉన్నాయని.. వాస్తవానికి ఆ పథకాల లబ్ధికి కాలపరిమితి ముగిసినప్పటికీ ముందు డేట్ వేసి ఆ నిధులు వచ్చేలా చేస్తానని చెబుతాడు.

ఇందుకోసం లబ్ధిదారుల తరపున కొంతమొత్తాన్ని చెల్లించవలసి ఉంటుందని  అయితే ఇప్పుడు అంత సమ యం లేదు కాబట్టి మీరే ముందుగా కొంత మొత్తాన్ని జమ చేస్తే నిధులు మంజూరవుతాయని నమ్మబలుకుతాడు.

దీంతో ప్రజా ప్రతినిధులు నాయుడు చెప్పిన బ్యాంక్‌ అకౌంట్‌కు డబ్బులు వేస్తారు. ఈ విధంగా 30 చీటింగ్ కేసుల్లో నాయుడు అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడిగా అవతరించాడు. ఈ 12 ఏళ్లలో రెండు రాష్ట్రాలకు చెందిన 35 మంది ప్రజా ప్రతినిధుల నుంచి కోట్లు కొట్టేశాడు.

తాజాగా అమలాపురం ప్రజాప్రతినిధికి ఫోన్ చేసి మాయ మాటల చెప్పి ప్రభుత్వ నిధులు మంజూరు చేయిస్తానని రూ. 2 లక్షలు పేటీఎం ద్వారా ఆన్‌లైన్‌లో వేయించుకుని సైబర్ నేరానికి పాల్పడ్డాడు.

తాను మోసపోయానని గ్రహించిన ఆ ప్రజాప్రతినిధి తన వ్యక్తిగత సహాయకుడి చేత అల్లవరం పోలీస్ స్టేషన్‌లో నాయుడుపై ఫిర్యాదు చేయించారు. దీంతో అతని నేరాల చిట్టా మరోసారి వెలుగు చూసింది.

నేరం చేసేటప్పుడు తెలివిగా వ్యవహరించే నాయుడు తన బ్యాంక్ అకౌంట్ కాకుండా తనకు బాగా పరిచయమున్న వారిది ఇస్తాడు. ఫోన్లు కూడా వేరొకరి నంబర్ల నుంచి కాల్ చేసి మాట్లాడి నేరం బయటకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు.

చివరికి కరోనాతో జనం అల్లాడుతున్న.. లాక్‌డౌన్ సమయంలో కూడా నాయుడి మోసాలు ఆగలేదు. జిల్లాల సరిహద్దులు దాటుతూ భీమవరం, కర్నూలు చెక్‌పోస్టుల వద్ద దొరికిపోయి క్వారంటైన్లకు కూడా వెళ్లాడు.

అక్కడ కూడా కొందరి ప్రజాప్రతినిధులకు ఫోన్ చేసి డబ్బులు వసూలు చేశాడు. క్వారంటైన్‌లో ఉన్న నాయుడిని పోలీసులు అక్కడి నుంచి రప్పించి అరెస్ట్ చేసి జైలుకు పంపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios