గుంటూరు: స్నేహితుల మధ్య చోటు చేసుకొన్న మనస్పర్థల కారణంగా  కాలేజీ హాస్టల్ బాత్‌రూమ్‌లోనే విద్యార్థిని శశి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయమై కాలేజీ హాస్టల్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం గుత్తావారిపాలెం గ్రామానికి చెందిన గూడపాటి శశి గుంటూరు  నగర శివారు పెదపలకలూరులోని ఓ ప్రైవేట్ కాలేజీ హాస్టల్‌లో ఉంటుంది. శశి ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఓ విద్యార్ధిని బ్యాగులో  డబ్బులు పోయాయి. ఈ విషయమై కొన్ని రోజులుగా విద్యార్థుల మధ్య గొడవలు చోటు చేసుకొన్నాయి.

ఈ డబ్బులను శశి తీసిందని సహచర విద్యార్థినులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  ఈ  ఆరోపణల నేపథ్యంలో  మనోవేదనకు గురైన శశి కాలేజీ హాస్టల్‌లోని బాత్‌రూమ్‌లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

గురువారం నాడు ఉదయం ఈ విషయాన్ని గమనించిన తోటి విద్యార్థులు కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చారు.  కాలేజీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.