వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఈ క్రమంలో శ్రీవారి భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. తిరుపతికి 20 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది.  

తిరుమల (tirumala) శ్రీవారి భక్తులకు రైల్వే శాఖ (indian railways) శుభవార్తను చెప్పింది. వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 20 ప్రత్యేక రైళ్లను నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే మంగళవారం వెల్లడించింది. ఇవాళ్టి నుంచి హైదరాబాద్–తిరుపతి, తిరుపతి–హైదరాబాద్, తిరుపతి–కాకినాడ టౌన్, కాకినాడ టౌన్–తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయని ఒక ప్రకటలో తెలిపింది. 

  • తిరుపతి–హైదరాబాద్ మధ్య 10 సర్వీసులు నడవనున్నాయి. సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా ఈ రైళ్లు తిరుపతి వెళ్లనున్నాయి. 
  • అలాగే తిరుపతి–కాకినాడ టౌన్ మధ్య 10 రైళ్లు నడుస్తాయి. రేణిగుంట, గూడురు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఏలూరు, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లి గూడెంల మీదుగా ప్రయాణిస్తాయి. 
  • ఇకపోతే.. కాచిగూడ–తిరుపతి మధ్య రెండు వేసవి ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడపనుంది. జూన్ 1, జూన్ 2న ఆ రైళ్లు నడుస్తాయి. ఉందానగర్, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంటల మీదుగా ఇవి నడుస్తాయి. 

మరోవైపు.. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. సాధారణంగా గంటకు 4500 మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తారు. అయితే ప్రస్తుతం గంటకు సుమారు 8 వేల మందికి దర్శనం కల్పించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఈ పరిస్థితి తప్పలేదని టీటీడీ (ttd) అధికారులు చెబుతున్నారు. ఆదివారం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 60 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. ఈ కంపార్ట్ మెంట్లలో 4 కి.మీ.మేర భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. వెంకటేశ్వరస్వామిని దర్శించుకొనేందుకు గాను కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులకు 48 గంటల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Also Read:తిరుమలకు పోటెత్తిన భక్తులు: నిండిపోయిన క్యూలైన్ కాంప్లెక్స్‌లు, నిరంతరాయంగా సర్వ దర్శనం

శుక్రవారం నుండి భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. శనివారం నాటికి ఈ సంఖ్య మరింతగా పెరిగింది. తిరుమల కొండలు భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్ కాంప్లెక్స్ లోకి భక్తులు ప్రవేశించడం కోసం క్యూ లైన్ మార్గాన్ని ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాల్సి వచ్చింది. శుక్రవారం నాడు దాదాపుగా 73,358 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. శనివారం సాయంత్రం 6 గంటల వరకు 70 వేల మంది భక్తులు వెంకన్నను దర్శించుకున్నారు. 

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వారాంతపు VIP బ్రేక్ దర్శనాలను రద్దు చేసి కేవలం ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే పరిమితం చేశారు. ఈ ఏడాది జూలై 15వ తేదీ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలపై ఆంక్షలుంటాయని టీటీడీ అధికారుల తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ సహా కొండపై పరిస్థితిని ఈవో ధర్మారెడ్డి శనివారం నాడు పర్యవేక్షించారు. అయితే ప్రస్తుత పరిస్ధితుల్లో తిరుమలకు రావాలనుకుంటున్న భక్తులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కూడా టీటీడీ అధికారులు సూచించారు.