అమెరికాలో ఉన్నత విద్యను చదువుతున్న తెలుగు విద్యార్థి దారుణంగా హత్యకు గురయ్యారు. ఆ విద్యార్థిని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన వీర సాయేష్ గా గుర్తించారు.  

అమెరికాలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎన్నో ఆశలతో అగ్రరాజ్యం అమెరికా వెళ్లిన ఆంధ్రప్రదేశ్ యువకుడు దారుణం హత్యకు గురయ్యారు. ఊహించని విధంగా దుండగుల కాల్పుల్లో పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లుకు చెందిన వీర సాయిష్ ప్రాణాలు కోల్పోయాడు. వీర సాయిష్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు.. ఒహియో స్టేట్ పిన్స్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నాడు.

అయితే.. వీర సాయిష్ ..పార్ట్ టైం జాబ్ గా ఓ పెట్రోల్ బాంకులో పని చేస్తున్నాడు. తన బాంక్ లో దోపిడీకి యత్నించిన దుండగులను అడ్డుకునే ప్రయత్నించాడు. దీంతో వీరపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వీరకు తీవ్ర గాయాలు కావడంతో ఓహియోహెల్త్ గ్రాంట్ మెడికల్ సెంటర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీర సాయేష్ పనిచేసిన గ్యాస్ స్టేషన్‌లో దుండగులు జరిపిన కాల్పుల్లో తీవ్రగాయాల పాలయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న కొలంబస్ ఫైర్ సర్వీస్ సిబ్బంది బాధితుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ.. తెల్లవారుజామున 1.27 గంటలకు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఘటనపై విచారణ జరుపుతున్నామని, బంధువులకు సమాచారం అందించామని పోలీసులు తెలిపారు.

పోలీసులు జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం.. "ఏప్రిల్ 20, 2023న మధ్యాహ్నం 12:50 గంటలకు W.బ్రాడ్ సెయింట్ 1000 బ్లాక్‌లో కాల్పులు జరిపినట్లు కొలంబస్ పోలీసు అధికారులు ఓ ఫిర్యాదును అందుకున్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సంఘటనలో ఒక యువకుడు బలి అయ్యాడని, బుల్లెట్ గాయాలు తగిలి గాయపడి పడి ఉన్న సాయిష్ వీర అని గుర్తించబడ్డారు. " అని పేర్కొన్నారు. ఈ సంఘటన గురువారం కొలంబస్ డివిజన్‌లో జరిగింది. తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ప్రస్తుతం వీర కుటుంబ సభ్యులు ఏలూరులో నివసిస్తున్నారు. వీర మృతదేహాన్ని సొంత ఊరికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరో 10 రోజుల్లో కోర్సు పూర్తి 

వీర మృతదేహాన్ని భారత్‌కు పంపించేందుకు ఆన్‌లైన్‌లో నిధులు సేకరణ ప్రారంభించారు. ఈ క్రమంలో వీర స్నేహితుడు రోహిత్ యలమంచిలి మాట్లాడుతూ.. మరణించిన యువకుడు వీర మాస్టర్స్ కోర్సు చదువుతూ హెచ్1బీ వీసా కింద ఎంపికయ్యాడు. అతని గ్రాడ్యుయేషన్‌కు ఇంకా 10 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిపారు. కొన్ని వారాల్లో ఉద్యోగం మానేయబోతున్నట్లు తెలిపాడని చెప్పారు. వీరా తన కుటుంబంలో చదువుకోవడానికి అమెరికా వచ్చిన మొదటి సభ్యుడు. తన తండ్రి రెండేళ్ల క్రితమే చనిపోయాడని, ఇంతలోనే వీర చనిపోవడం బాధకరమని అన్నారు. ఇంక యలమంచిలి మాట్లాడుతూ.. వీర ఇతరులకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సహాయం చేసేందుకు సిద్ధంగా ఉండేవారని, క్రికెట్‌ బాగా ఆడేవాడనీ, కొలంబస్ ప్రాంతంలో క్రికెట్ ఆడే ప్రతి ఒక్కరికీ వీర తెలుసనీ, అతను దాదాపు అందరితో సన్నిహితంగా ఉండేవాడని తెలిపారు.