స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆ మువ్వన్నెల జెండా సాక్షిగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలపై వరాలు కురిపించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా సాామాన్య, మధ్యతరగతి ప్రజల ఇంటి ఖర్చులు పెరగకుండా ఉండేలా కీలక ప్రకటన చేశారు.

Nara Chandrababu Naidu : భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి అంటే 2047 నాటికి ఆంధ్ర ప్రదేశ్ ను దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలపడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. "దేశానికి మనం ఏమి ఇచ్చాం?" అనే భావనతో ప్రతి పౌరుడూ 'నా దేశం - నా బాధ్యత' అనే సంకల్పంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మన చేతిలో జాతీయ జెండా, గుండెల్లో అభివృద్ధి అజెండా ఉండాలని సూచించారు.

80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను రాజధాని అమరావతిలో ఘనంగా నిర్వహించింది ఏపీ ప్రభుత్వం. రాయపూడిలోని పరేడ్‌ గ్రౌండ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగం సాగింది. వికసిత్ భారత్ 2047, స్వర్ణాంధ్ర 2047 దిశగా సాధించాల్సిన లక్ష్యాలు, గత పాలన విధ్వంసం నుంచి కోలుకుంటున్న రాష్ట్ర భవిష్యత్తు కార్యాచరణను సమగ్రంగా ఆవిష్కరించారు.

వికసిత భారత్ కు 'స్వర్ణాంధ్ర' బలమైన పునాది

రాబోయే 20 ఏళ్లలో భారతదేశం ప్రపంచ స్థాయికి ఎదుగుతుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ 2047 సాధనకు ఒక బలమైన రాష్ట్రం అవసం అని, అదే సమయంలో స్వర్ణాంధ్ర నిర్మాణం కోసం కేంద్ర సహకారం ఎంతైనా ప్రాధాన్యమైనదని తెలిపారు. కాబట్టి దేశానికి రాష్ట్రం, రాష్ట్రానికి దేశం వెన్నుదన్నుగా నిలిచి ముందుకు సాగుతాయన్నారు.

విద్యార్థులు నైపుణ్యాలతో, ఉద్యోగులు అంకితభావంతో, మహిళలు సాధికారతతో, రైతులు బాధ్యతతో పనిచేసినప్పుడే నవసమాజ నిర్మాణం సాధ్యమవుతుందని చంద్రబాబు అన్నారు. అందుకే లక్ష్యాలు నిర్దేశించుకోవడమే కాదు... వాటి సాధనకు స్పష్టమైన విజన్ యాక్షన్ ప్లాన్ ఉండాలని సూచించారు.

విధ్వంసం నుంచి వికాసం దిశగా..

రాష్ట్ర చరిత్రను గుర్తుచేసిన సీఎం అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాల పునాదులపై ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని… 2014 విభజన కష్టాలను దాటుకుని ముందుకు సాగామని తెలిపారు. అయితే 2019-2024 మధ్య కాలంలో జరిగిన పాలనా వైఫల్యాలు, విధ్వంసకర నిర్ణయాల వల్ల రాష్ట్ర అభివృద్ధి 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై, వృద్ధి రేటు 13.5 శాతం నుండి 10 శాతానికి పడిపోగా, అప్పులు రూ. 9 లక్షల కోట్లకు పైగా గుదిబండగా మారాయని వివరించారు.

2024 ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్, తాను కూటమిగా ఏర్పడి ప్రజల ముందుకు వచ్చామని, ప్రజలు కూటమికి 94 శాతం స్ట్రైక్ రేట్‌తో చరిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టారని చంద్రబాబు గుర్తుచేశారు. ఈ విజయాన్ని అధికారంగా కాకుండా ఒక పెద్ద బాధ్యతగా స్వీకరించామని…పాలనాపగ్గాలు చేపట్టిన 26 నెలల్లోనే ప్రజలకు స్పష్టమైన మార్పు కనిపించేలా 'విధ్వంసం నుండి వికాసం' దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధి రేటు తిరిగి 11.3 శాతానికి పెరిగింది అని వెల్లడించారు.

'సూపర్ సిక్స్' దిగ్విజయం

గత ప్రభుత్వం నిలిపివేసిన ప్రజాక్షేమ పథకాలను పునరుద్ధరించడమే కాకుండా, ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఇప్పటివరకు రూ. 1,50,000 కోట్లను సంక్షేమం కోసం ఖర్చు చేశామని స్పష్టం చేశారు.

పెన్షన్ల పెంపు : అధికారంలోకి రాగానే సామాజిక పింఛన్లను పెంచి పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాం.

తల్లికి వందనం : ఈ పథకాన్ని ప్రభుత్వ ఖర్చుగా చూడకుండా, పిల్లల భవిష్యత్తుపై రాష్ట్రం పెట్టిన అత్యుత్తమ పెట్టుబడిగా భావిస్తున్నాం.

స్త్రీశక్తి (ఉచిత బస్సు ప్రయాణం) : మహిళలకు రవాణా సౌకర్యాన్ని ఉచితంగా అందిస్తూ వారి ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతున్నాం.

దీపం-2 : ప్రతి కుటుంబానికి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించి ఇల్లాలి ముఖంలో వెలుగులు నింపాం.

అన్నా క్యాంటీన్లు : పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను పట్టణాల్లోనే కాకుండా త్వరలోనే గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తున్నాం.

5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు

యువతకు అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యం అని చంద్రబాబు ప్రకటించారు. ఇందుకోసమే తొలి సంతకంతోనే 15,000 కంటే ఎక్కువ ఉపాధ్యాయ పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించి యువత కలలను నెరవేర్చామన్నారు. ఇకపై ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ ఏడాదే 10,000 పైగా ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని పేర్కొన్నారు.

పారిశ్రామిక విప్లవం: రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు/ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం. దేశానికి వచ్చే మొత్తం విదేశీ పెట్టుబడుల్లో కనీసం 25 శాతం ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేలా కార్యాచరణ రూపొందించాం. ప్రతి నియోజకవర్గంలో MSME పార్కులు ఏర్పాటు చేస్తున్నాం.

అన్నదాతకు అండగా..

''రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రగతికి మూలస్తంభం. 'పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ' కింద ప్రతి రైతుకు ఏడాదికి రూ. 20,000 సాయం అందిస్తున్నాం. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. పొగాకు రైతులకు వడ్డీ లేని రూ. 50,000 రుణ సదుపాయం కల్పిస్తున్నాం'' అని తెలిపారు సీఎం.

రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ధ్యేయంగా పెట్టుకున్నామని సీఎం తెలిపారు. ఇప్పటికే రూ. 25,000 కోట్లు ఖర్చు చేయగా, రాబోయే మూడేళ్లలో మరో రూ. 35,000 కోట్లు నీటిపారుదల ప్రాజెక్టులపై ఖర్చు చేస్తామని వెల్లడించారు. అనకాపల్లి జిల్లాకు త్వరలోనే గోదావరి జలాలు అందిస్తామని హామీ ఇచ్చారు. 9 ప్రధాన జలాశయాల గేట్ల మరమ్మతులు వేగవంతం చేశామన్నారు చంద్రబాబు

డ్రోన్లు, శాటిలైట్ చిత్రాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి ఆధునిక సాంకేతికతను సాగులో ఉపయోగిస్తున్నామన్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుతో పాటు ప్రకృతి సేద్యానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు.

రాజధాని అమరావతి నిర్మాణం

రాష్ట్ర ఆర్థిక చక్రం తిరిగి తిరగడానికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతగానో తోడ్పడుతోందని సీఎం కొనియాడారు. పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ నిర్మాణాల్లో కేంద్రం పూర్తి సపోర్ట్ ఇస్తోందన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి పోలవరం పనులన్నీ పూర్తి చేసి, గోదావరి పుష్కరాల కంటే ముందే ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు.

ఇక రాజధాని అమరావతిని స్వయం సమృద్ధి (Self-Finance) ప్రాజెక్టుగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాజధానిలో రూ. 50,000 కోట్ల విలువైన పనులు వేగంగా జరుగుతున్నాయి... భవిష్యత్తులో ప్రతి ఆంధ్రుడు 'అమరావతి నా రాజధాని' అని గర్వంగా చెప్పుకునేలా ప్రపంచంలోనే నంబర్ వన్ నగరంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు అన్నారు.

ఓడరేవులు & కనెక్టివిటీ : రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టులతో పాటు వివిధ ప్రాంతాల్లో ఆధునిక షిప్పింగ్ హార్బర్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో రూ. 64,000 కోట్లతో రైల్వే పనులు కొనసాగుతున్నాయి. 20,000 కిలోమీటర్ల రోడ్ల మరమ్మతులు పూర్తి చేసి రాష్ట్రంలో గుంతలు లేని రహదారులను తయారుచేశామన్నారు. ఏపీని దేశానికే ప్రధాన లాజిస్టిక్ హబ్‌గా (Logistics Hub) మారుస్తుని చంద్రబాబు హామీ ఇచ్చారు.

సామాజిక న్యాయం

అన్ని వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన నమూనా అని చంద్రబాబు తెలిపారు. బిసిలకు పెద్దపీట వేస్తూ, వడ్డెరలకు మైనింగ్ లైసెన్సులు, గీత కార్మికులకు వైన్ షాపుల్లో రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. ఇమామ్‌లు, మౌజమ్‌ల గౌరవ వేతనాన్ని పెంచామని, అర్హులైన పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మిస్తున్నామని వెల్లడించారు.

విద్యుత్ ఛార్జీలపై సీఎం చంద్రబాబు తీపి కబురు

"మా ప్రభుత్వం వచ్చి 26 నెలలు దాటినా ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. రాబోయే 3 సంవత్సరాలలో కూడా కరెంట్ ఛార్జీల పెంపు ఉండదని నేను హామీ ఇస్తున్నాను'' అని ప్రకటించారు. పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ రూఫ్‌టాప్‌లను ప్రోత్సహిస్తూ గ్రీన్ ఎనర్జీ రంగానికి శ్రీకారం చుట్టామన్నారు.

విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ప్రాంతాలను ప్రధాన ఎకనామిక్ రీజియన్లుగా (Economic Regions) అభివృద్ధి చేస్తూ, 'హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ' (Healthy, Wealthy, Happy AP) సాధించడమే తమ కూటమి ప్రభుత్వ అంతిమ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్నో సవాళ్లను అధిగమించి సాధించిన ఈ ప్రగతి ప్రయాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, 'స్వర్ణాంధ్ర 2047' కలలను నిజం చేసుకుందామని పిలుపునిచ్చారు.