బుట్టా రేణుక..మంగళవారమే వైసీపీలో నుండి టిడిపిలోకి ఫిరాయించిన ఎంపి. చంద్రబాబునాయుడు సమక్షంలో తన అనుచరులతో టిడిపిలో చేరారు. అయితే, ఇక్కడే ఓ చిన్న విషయముంది. ఎంపి అనుచరులందరికీ చంద్రబాబు టిడిపి కండువాలు కప్పారు. కానీ ఎంపికి మాత్రం కప్పలేదు. ఎందుకు కప్పలేదు ? ఒకపార్టీ నుండి ఇంకోపార్టీలోకి చేరారంటేనే అర్ధం చేరిన పార్టీ కండువా కప్పుకోవటం. అంటే బుట్టా టిడిపిలోకి ఫిరాయించినా టిడిపి కండువా మాత్రం కప్పుకోలేదు. కారణమేంటి ?

కారణమేంటంటే, రేపటి రోజు పార్లమెంటులో ఇబ్బందులొస్తాయనేమో. అసెంబ్లీలో ఉన్నట్లుగా పార్లమెంటులో పరిస్ధితులుండవు. అసెంబ్లీలో ఫిరాయింపులపై చర్యలు తీసుకోవటానికి స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు సంవత్సరాలు పట్టవచ్చు. కానీ పార్లమెంటులో ఆ పప్పులుడకవు. స్పీకర్ తన ఇష్టానుసారం నిర్ణయం తీసుకుంటామంటే కుదరదు. ఎందుకనంటే, పార్లమెంటులో ఎన్నో పార్టీల తరపున ప్రాతినిధ్య వహిస్తుంటారు ఎంపిలు. నిర్దిష్ట కాలంలోగా ఎంపిపై చర్యలు తీసుకోకపోతే ప్రతిపక్షాలు స్పీకర్, ప్రధానిని ఏకిపారేస్తాయి.

ఓ ఎంపి పార్టీ మారారనగానే వెంటనే సదరు పార్టీ నాయకత్వం వెంటనే స్పీకర్ పై చర్యలకు ఫిర్యాదు చేస్తుంది. ఫిరాయించిన పార్టీ కండువా కప్పుకున్న ఫొటోలే అందుకు సాక్ష్యం. పార్టీ ఫిరాయించారనటానికి ఫొటో సాక్ష్యం కన్నా స్పీకర్ కు ఇంకేం కావాలి? కాబట్టి ఎక్కువ కాలం విషయాన్ని నానబెట్టటం సాధ్యం కాదు. అందుకనే పార్టీ మారదలుచుకున్న ఎంపిలు వేరే పార్టీలో చేరినా పార్టీ కండువా మాత్రం కప్పుకోరు. అంటే సాంకేతికంగా కారణాలతో తమ ఎంపి పదవిని నిలుపుకుంటున్నారన్నమాట.

మూడేళ్ళ క్రిందటే టిడిపిలోకి ఫిరాయించిన వైసీపీ ఎంపిలు కొత్తపల్లి గీత, ఎస్పీవై రెడ్డి చేసింది కూడా అదే. తమ అనుచరులకు టిడిపి కండువాలు కప్పించారే గానీ తాము మాత్రం కప్పుకోలేదు. వైసీపీ నుండి టిడిపిలోకి ఫిరాయించిన 21 మంది ఎంఎల్ఏలు టిడిపి కండువ కప్పుకున్న విషయం అందరూ చూసిందే. స్వయంగా చంద్రబాబే వారందరికీ కండువాలు కప్పారు. ఎందుకంటే, స్పీకర్ తమ విషయంలో ఏ నిర్ణయం తీసుకోరన్న ధైర్యం. మొత్తం మీద పార్టీ కండువా కప్పుకోకుండానే బుట్టా టిడిపి నేతగా చెలామణి అవుతారన్నమాట. అందుకే అన్నారు ‘శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాల’ని.