ఇవాళ జరిగిన ఏపీ పీఆర్సీ సాధన స్టీరింగ్ కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్టీరింగ్ కమిటీలో ఆర్టీసి జేఏసి నుండి ఇద్దరికి, హైకోర్టు జేఏసి నుండి ఒకరికి చోటు కల్పించారు. 

అమరావతి: జగన్ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఉద్యోగ సంఘాలన్ని ఒకేతాటిపైకి వచ్చి పీఆర్సీ (PRC) ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళుతున్నాయి. ఈ క్రమంలోనే మరికొన్ని ఉద్యోగ సంఘాలను కలుపుకుపోయేందుకు పీఆర్సీ సాధన స్టీరింగ్ కమిటీ (prc steering committee) సిద్దమయ్యింది. శుక్రవారం సమావేశమైన స్టీరింగ్ కమిటీ సభ్యులు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 

స్టీరింగ్ కమిటీలోకి ప్రత్యేక ఆహ్వానితులుగా ఏపీఎస్ ఆర్టిసి (apsrtc) జెఏసి నుండి ఇద్దరిని తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే హైకోర్టు ఉద్యోగులు జెఏసి నుండి ఒకరిని కూడా స్టీరింగ్ కమిటీలోకి ఆహ్వానితులుగా తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఇలా అందరినీ కలుపుకుపోతూ పీఆర్సీ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు. 

ఇక ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తున్నా ఉద్యోగ సంఘాలే రావడంలేదంటూ చేస్తున్న ప్రచారంపై ఈ సమావేశంలో చర్చించారు. తమకు ఇప్పటివరకు చర్చలకు రావాలని ప్రభుత్వం నుండి ఎలాంటి ఆహ్వానం అందకపోవడంతో కమిటీ సభ్యుల మధ్య చర్చ జరిగింది. ఆహ్వనించకుండానే చర్చలకు రావాలని అనడంపై స్టీరింగ్ కమిటీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. 

స్టీరింగ్ కమిటీ సమావేశం అనంతతరం ఉద్యోగ సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడారు. పీఆర్సీ సాధన సమితి నేత కె.ఆర్ సూర్యనారాయణ మాట్లాడుతూ... రాష్ట్రంలో ఉద్యోగులు రెండు పీఆర్సీల కాలాన్ని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేసారు. వేతన సవరణ తేదీకి, అమలు తేదీకి ప్రభుత్వాలు వ్యత్యాసం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. 

''గతంలో ఎప్పుడూ మధ్యంతర భృతి వెనక్కు తీసుకోలేదు. మధ్యంతర భృతి వడ్డీ లేని అప్పు అని మాకు తెలీదు. మధ్యంతర ఉపశమనం ఏ రకంగా రుణంగా కనిపించిందో అధికారులు చెప్పాలి. ఐఏఎస్ ల మాదిరిగా గొప్ప చదువులు చదవకపోయినా ఇది సాధారణ లెక్కలేనని ప్రతీ ఉద్యోగికి తెలుసు. ఐఆర్ జీవోలో ఒక తరహాగా, గత పీఆర్సీ లో ఒకలా ఉండటం తప్పుదోవ పట్టించడమే'' అని సూర్యనారాయణ అన్నారు.

''కేంద్ర పే కమిషన్ కు వెళ్తామని చెప్పడాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. పీఆర్సీ అమలు విషయంలో మూల వేతనం నిర్దారించే విషయంలో కేంద్రం నిర్దారించిన సిఫార్సులు ఆచరణలోకి తీసుకున్నారా? లేదా? చెప్పాలి'' అని ప్రశ్నించారు. 

''ఇక ఏపీఎస్ ఆర్టీసీ, గ్రామ వార్డు సచివాలయాల సంఘాలు కూడా ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతారు. ఏపీ హై కోర్టు, సబార్డినెట్ కోర్టులకు చెందిన ఉద్యోగుల కూడా భాగస్వాములు అవుతారు. ఈ సంఘాల నుంచి ఒక ప్రతినిధి ప్రత్యేక ఆహ్వానితులుగా స్టీరింగ్ కమిటీ లో ఉంటారు'' అని సూర్యనారాయణ తెలిపారు.

ఇక మరో పీఆర్సీ సాధన సమితి నేత నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... : సీఎంఓ అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు బలవంతంగా ఉద్యోగులను సమ్మెలోకి నేట్టారన్నారు. ఉద్యోగుల చలో విజయవాడను బలప్రదర్శనగా చెబుతున్న ప్రభుత్వ పెద్దలు మమ్మల్ని కుటుంబంలా చూడటం లేదా? ఉద్యోగులను శత్రువులుగా ప్రభుత్వం భావిస్తోందా? అని ప్రశ్నించారు. 

''రాజకీయ ప్రసంగాలు ఉద్యోగులకు అవసరం లేదు. సమ్మె చేస్తే ఉద్యోగులకు ఆనందం ఎలా అవుతుంది... ఈ సమయంలో జీతాలు కూడా రావు కదా. మా బాధలు వినడానికి ఆఖరి అస్త్రంగా మాత్రమే తప్పనిసరై సమ్మెకు వెళ్తున్నాం'' అన్నారు. 

''చర్చలు జరిగిన ప్రతీ సారీ అవమాన పరుస్తున్నారు. 14 సార్లు చర్చలకు పిలిచినా ఏం ఉపయోగం ఉంది. ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో బహిరంగ చర్చలకు సిద్ధమా చెప్పాలి. సమ్మెలోకి వెళ్తే ఆ జీతాలు కూడా మిగుల్చుకోవచని ప్రభుత్వ కుట్ర. ప్రజల నుంచి కూడా ఉద్యోగులకు సహకారం అందింది. వారు స్వచ్ఛందగానే చలో విజయవాడలో నీరు, మజ్జిగ ఇచ్చారు'' అని బొప్పరాజు పేర్కొన్నారు.