ఏపీలో ఇసుక ఫ్రీ... స్టాక్ పాయింట్లు, సిల్ట్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి..
ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక సమస్య కారణంగా కొన్నాళ్లుగా నిర్మాణ రంగంలో ఇబ్బందులు తలెత్తాయి. రాష్ట్రంలో నిర్మాణ పనులు మందకొడిగా సాగుతుండటతో అటు యజమానులతో పాటు, ఇటు కార్మికులు నష్టపోయారు. ఈ నేపథ్యంలో ఇసుక లభ్యతపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టింది.
ప్రజలకు మేలు చేయడమే తమ ముందున్న తక్షణ కర్తవ్యమని రాష్ట్ర గనులు, భూగర్భ, ఆబ్కారీ (ఎక్సైజ్) శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గత ప్రభుత్వం ఇసుకను ఆదాయ వనరుగా భావించి పేదల ప్రజల నోట్లో మట్టికొట్టిందన్నారు. మరోవైపు నాయకులతో ఇసుక దందాను ప్రోత్సహించిందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇసుకను ఉచితంగా అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లు ప్రకటించారు. ఆ మేరకు విధివిధానాలు రూపొందించి త్వరలోనే నిర్ణయం వెలువరుస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక సమస్య కారణంగా కొన్నాళ్లుగా నిర్మాణ రంగంలో ఇబ్బందులు తలెత్తాయి. రాష్ట్రంలో నిర్మాణ పనులు మందకొడిగా సాగుతుండటతో అటు యజమానులతో పాటు, ఇటు కార్మికులు నష్టపోయారు. ఈ నేపథ్యంలో ఇసుక లభ్యతపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీనిపై స్పందించిన రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పలు విషయాలు వెల్లడించారు.
‘‘జగన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రంలో నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైంది. ఇసుక మొత్తాన్ని పీల్చి పిప్పి చేసి పేదల పొట్టకొట్టాడు. ప్రతి పేదవానికి ఇసుక అందుబాటులో ఉంచి, నిర్మాణ రంగానికి అండగా నిలవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అందుకు తగ్గట్లుగా రాష్ట్రంలోని ఇసుక రీచుల్లో ఇసుక అందుబాటులో ఉంచుతాం. నూతన పాలసీని అన్ని జిల్లాల్లో కలెక్టర్లు మానిటర్ చేస్తారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో భవన నిర్మాణ రంగం కుదేలైంది. దానిపై ఆధారపడిన కార్మికులందరు రోడ్లపై పడ్డారు. వారిని యాచించే దుస్థితికి తీసుకు వచ్చారు. వచ్చే మూడు నెలల్లో కోటి టన్నులకు పైగా ఇసుక అవసరం ఉంటుందని అంచనా. అందుకు సంబంధించిన పర్మిషన్లు కూడా అయిపోయాయి. గత పాలకులు అనుమతులతో సంబంధం లేకుండా తోడుకున్నారు. కేంద్రం, ఎన్జీటీ నుండి మొట్టికాయలు వేసినా పట్టించుకోలేదు. ప్రస్తుతం శాఖలో నెలకొన్న సమస్యల్ని పరిష్కరించడానికి 15 రోజులకు పైగా సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాంతంలో కూడా ఇసుక లోటు అనే మాట వినబడకూడదన్నదే మా ధ్యేయం. అందుకు అనుగుణంగా అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తాం’’ అని కొల్లు రవీంద్ర తెలిపారు.
‘‘ఎవరైనా ఇసుక బ్లాక్ మార్కెట్ వ్యాప్తి చేయాలని చూస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయి. అనధికారిక ఇసుక రీచ్‌లను అదుపులోకి తీసుకుని ఉచిత ఇసుక పాలసీని పూర్తిస్థాయిలో అమలు చేస్తాం. గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తే.. జగన్ రెడ్డి ఇసుకను ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ఇసుక కుంభకోణంలో దొంగలకు శిక్ష తప్పదు. సాంకేతికంగా ఎదురవుతున్న సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకే ఎక్కువ సమయం పడుతోంది. వర్షాకాలంలో రీచుల్లో ఇసుక తవ్వకాలకు అవకాశం లేదు. అందువల్ల స్టాక్ పాయింట్స్, సిల్ట్ లను అందుబాటులో ఉంచుతాం. రావాల్సిన బకాయిలన్నీ రాబడుతాం. మూసివేసిన రీచ్‌లు తెరుస్తాం. రికార్డులన్నీ తనిఖీ చేసి ఒక్కో దాన్ని కరెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తాం. టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి కలెక్టర్ ఆధ్వరంలో ఇసుక రవాణా సక్రమంగా జరిగేలా చూస్తాం’’ అని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.