ఎండలు దంచి కొడుతున్నాయి.. మంట పుట్టిస్తున్నాయి. దీనికి తోడు వడగాలులు చెమటలు కక్కిస్తున్నాయి. రాబోయే రోజుల్లో వడగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. 

ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడినట్లు ఐఎండీ తెలిపింది. దీనికి అనుబంధముగా 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనము కొనసాగుతుందని వెల్లడించింది. 

ఇది రాబోయే 24 గంటలలో మరింత బలపడి.. వాయుగుండంగా మారే అవకాశం చెప్పింది. దీని ప్రభావంతో గురు, శుక్ర వారాల్లో బలమైన గాలులు వీస్తాయని స్పష్టం చేసింది. అల్పపీడన ప్రభావం ఏపీపై ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 

రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాంధ్రాలో పొడి వాతావరణం ఉంటుందని ఐఎండీ చెప్పింది. ఉభయ గోదావరి జిల్లాలో అక్కడక్కడ వడగాలులు వీస్తాయని తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రలో రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఉండి.. ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్పింది. 

వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. రాయలసీమ జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంటుందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఐఎండీ హెచ్చరికల ప్రకారం రేపు 113 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 217 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉండనుంది.

గుంటూరులో 29, కృష్ణా జిల్లాలో 27, విజయనగరం 19, విశాఖలో 10 మండలాల్లో తీవ్ర వడ గాలులు వీచే సూచనలు ఉండగా.. ఏప్రిల్ 2న 148 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 207 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉండనుంది.. గుంటూరులో 33, కృష్ణాలో 24, పశ్చిమ గోదావరిలో 18, విజయనగరం 18, తూర్పు గోదావరిలో 16, విశాఖలో 15, శ్రీకాకుళంలో 10 మండలాల్లో తీవ్ర వడగాలులు వీయనున్నాయని పేర్కొంది ఐఎండీ.