ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కావాలని ఆయన అభిమానులతోపాటు తాను కూడా కోరుకుంటున్నట్టు మంత్రి విశ్వరూప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎవరైనా యాత్రలు చేయొచ్చని, 175 స్థానాల్లో పోటీ చేసి మెజార్టీ మార్కు తెచ్చుకుంటూ సీఎం అయిపోవచ్చని ఆయన వివరించారు. పొత్తుల్లోనూ కనీసం 50 స్థానాలు గెలుచుకోవాలని అన్నారు. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి పెరిగింది. టీడీపీ, జనసేనలు ఒక వైపు.. వైసీపీ మరో వైపు వేడి వాడి వ్యాఖ్యలు చేసుకుంటున్నాయి. ప్రజల ఆదరణ కోసం ప్రతిపక్షాలు యాత్రలు చేస్తున్నాయి. నారా లోకేశ్ యాత్ర ఒక వైపు ఉండగా.. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభించారు. సీఎం పదవి పైనా ఈ నేపథ్యంలో జోరుగా కామెంట్లు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్, ఆయన అభిమానుల, ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ డిస్కషన్ ఉంటే సాధారణమే అనుకోవచ్చు. కానీ, రాష్ట్ర మంత్రి పవన్ కళ్యాణ్ సీఎం కావాలని అనడం సంచలనంగా మారింది. అయితే.. ఆయన ఈ వ్యాఖ్య చేయడం వెనుక సారం వేరే ఉన్నది.

పవన్ కళ్యాణ్ అభిమానులతోపాటు.. తాను కూడా ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాని ఆంధ్రప్రదేశ్ మంత్రి విశ్వరూప్ తిరుమలలో అన్నారు. తిరుమలలో ఆయన మాట్లాడుతూ.. తాను కూడా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నాని వివరించారు. రాష్ట్రంలో ఎవరైనా యాత్రలు, పాదయాత్రలు చేసుకోవచ్చని అన్నారు. అయితే, సీఎం కావాలంటే మాత్రం దానికి ఒక లెక్క ఉంటుందని వివరించారు. రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయని తెలిపారు. అన్ని స్థానాల్లో పోటీ చేసే సగానికి ఎక్కువ అంటే కనీసం 88 స్థానాల్లో గెలిస్తే సీఎం కావడం ఒక విధానం అని వివరించారు. లేదా.. పొత్తుతో పోటీ చేస్తే (టీడీపీతో జనసేన కలిసి పోటీ చేస్తే అనే కోణంలో మాట్లాడుతూ..) 100 స్థానాల్లోనైనా పోటీ చేయాలని, అందులో కనీసం 50 స్థానాల్లోనైనా గెలవాలని చెప్పారు. ఈ రెండు విధాల్లో ముఖ్యమంత్రి కావొచ్చని అన్నారు.

Also Read: రేపు తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. పర్యటన షెడ్యూల్ ఇదే

జనసేన అన్ని స్థానాల నుంచి పోటీ చేయడం ఈ సారికి సాధ్యమయ్యేలా లేదు. అలాగే, 100 స్థానాలను టీడీపీ.. జనసేనకు వదిలిపెడుతుందనేదీ అసాధ్యమే. కాబట్టి, ఈ రెండు రీతుల్లోనూ పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశాలు లేవని మంత్రి పరోక్షంగా తెలిపినట్టు అర్థం అవుతున్నది.