ఇటీవల బామ్మ వయసులో ఉన్న మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఈ వయసులో ఆమె పిల్లలను ఎలా కన్నారంటూ కొందరు ప్రశ్నించగా.. మరికొందరు మాత్రం... డాక్టర్లదే తప్పని తేల్చేశారు. కాగా... ఈ వివాదంపై ఇండియన్ ఫెర్టిలిటీ సొసైటీ(ఐఎఫ్ఎస్) తాజాగా స్పందించింది.

ఈ ఘటనపై క్షమాపణలు తెలియజేసింది.. భవిష్యత్తులో ఇలా జరుగకుండా చూస్తామని, ఇండియన్ సొసైటీ ఆఫ్ రీ ప్రొడక్షన్, అకాడెమీ ఆఫ్ క్లినికల్ ఎంబ్రాలజిస్ట్స్ , ఐఎఫ్ఎస్ ఓ ప్రకటనలో క్షమాపణలు తెలిపాయి. ఇది పూర్తిగా అనైతిక చర్యని, నిబంధనలను దుర్వినియోగపరిచారని, అంత పెద్ద వయసులో గర్భం దాల్చడం వల్ల అనర్థాలే అధికమని వెల్లడించాయి. ఏ విధానంలో అయినా 50 సంవత్సరాలు దాటితే, మహిళ గర్భం నుంచి పిల్లల్ని పుట్టించడం సరైన విధానం కాదని, ఈ వయసులో మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులకు అవకాశం అధికమని తెలిపిన ఐఎఫ్ఎస్, ఐవీఎఫ్, సరోగసీ విధానాల్లో చట్టాలు సరిగ్గాలేనందునే ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొంది.

కాగా...తూర్పు గోదావరి జిల్లా నెలపర్తిపాడుకు చెందిన ఎర్రమట్టి రాజారావు, మంగాయమ్మ దంపతులకు ఐవీఎప్ విధానంలో సంతాన భాగ్యం కలిగింది. వీరికి 1962లో వివాహం కాగా, ఏళ్ల తరబడి హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా పిల్లలు కలగలేదు. వయసు మీదపడినా మంగాయమ్మకు మాత్రం తల్లి కావాలని కోరిక బలంగా ఉండేది. వారికి తెలిసిన ఓ మహిళ 55 ఏళ్ల వయసులో ఐవీఎఫ్ విధానంలో బిడ్డకు జన్మనివ్వడంతో మంగాయమ్మలో ఆశలు చిగురించాయి. గతేడాది నవంబర్‌లో గుంటూరులోని అహల్య హాస్పిట‌ల్‌ను సంప్రదించారు. ఐవీఎఫ్‌ నిపుణులైన డాక్టర్‌ శనక్కాయల ఉమాశంకర్‌ మంగాయమ్మన పరీక్షించారు.

ఆమెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోవడంతో... ఐవీఎఫ్ విధానం చేశారు. మరో స్త్రీ అండం, ఆమె భర్త వీర్యంతో ఈ విధానం చేశారు. కాగా.. ఇటీవల ఆమె ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డలు ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారు.  

related news

ఈ వయసులో పిల్లలు ఎంత వరకు కరెక్ట్..?

గుంటూరులో కవలలకు జన్మనిచ్చిన 74 ఏళ్ల బామ్మ

74ఏళ్ల బామ్మకు డెలివరీ.. హాస్పిటల్ సంచలన నిర్ణయం