బామ్మ వయసులో ఉన్న మహిళ... ఈరోజు అమ్మ అయ్యింది. గుంటూరుకి చెందిన మంగాయమ్మ అనే 74ఏళ్ల బామ్మ... ఈ వయసులో ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. మీడియాలో ఇదే పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఈ వయసులో ఆమె పిల్లలను కనడం ఎంత గొప్ప విషయమంటూ అందరూ ఈ విషయాన్ని షేర్ చేసుకున్నారు.

అయితే... ఇక్కడే చాలా మంది సందేహం కలిగింది. 30ఏళ్లు దాటాక పిల్లలను కంటేనే కష్టం అని డాక్టర్లు చెబుతూ ఉంటారు. అలాంటి వైద్యులు ఆమెకు ఈ వయసులో ఐవీఎఫ్ ద్వారా పిల్లలను కనేలా ఎలా ప్రోత్సహించారు అనేది ఇప్పుడు అందరికీ కలుగుతున్న ప్రశ్న. సరే... ఆమె ఆరోగ్యంగా ఉంది కాబట్టి ఇప్పుడు పిల్లలను కన్నారు అనే అనుకుందాం.  74 ఏళ్ల మహిళ ఎంతకాలం బ్రతకగలదు..? ఒకవేళ బ్రతికినా... ఆరోగ్యంగా ఉండగలరా..? దాదాపు ఆ వయసు వాళ్లందరూ మరొకరిపై ఆధారపడి బతుకుతుంటారు. అలాంటిది ఆమె ఇద్దరు కవల పిల్లలను పెంచగలదా..? ఆమె వయసే 74 అంటే.. ఆమె భర్త వయసు ఇంకా ఎక్కువే ఉంటుంది.

అకస్మాత్తుగా ఈ దంపతులకు ఏదైనా అయితే... ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి..? అమ్మ అవ్వాలనే కోరిక ఆమెకు బలంగా ఉండొచ్చు కానీ... ఈ వయసులో ఆ నిర్ణయం తీసుకోవడం మాత్రం చాలా తప్పు అంటున్నారు నెటిజన్లు. సోషల్ మీడియా వేదికగా దీనిపై అందరూ తీవ్రంగా చర్చిస్తున్నారు. అదీకాక.. ఆ వయసులో ఆమెకు సీజేరియన్ ఎలా చేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. 

అమ్మ అని పిలిపించుకోవాలనే తపనే ఉంటే... మంచి వయసులో ఉన్నప్పుడే ఈ నిర్ణయం తీసుకోని ఉండాల్సింది లేదంటే... ఎవరైనా అనాథను పెంచుకోవచ్చు కదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. 74ఏళ్ల వయసులో అసలు పిల్లలు కనడం అనేది కరెక్ట్ కాదని రమణా యాదవల్లి అనే డాక్టర్ సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని తెలియజేశారు. కేవలం డాక్టర్లు తమ రికార్డు కోసమే ఇలాంటి పనిచేశారంటూ కొందరు విమర్శలు కురిపిస్తున్నారు. 

సంబంధిత వార్త

గుంటూరులో కవలలకు జన్మనిచ్చిన 74 ఏళ్ల బామ్మ