Asianet News TeluguAsianet News Telugu

నెల్లూరు కోర్టులో చోరీ: సీబీఐ విచారణకు సిద్దమన్న మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

నెల్లూరు కోర్టులో జరిగిన చోరీ ఘటనపై సీబీఐ విచారణకు తాను సిద్దమేనని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పారు. 

Iam Ready For CBI Probe On theft in Nellore Court says Minister Kakani Govardhan Reddy
Author
Nellore, First Published Apr 19, 2022, 3:35 PM IST


నెల్లూరు: కోర్టులో చోరీ కేసు ఘటనపై  సీబీఐ విచారణకు కూడా తాను సిద్దమేనని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పారు. మంగళవారం నాడు  Nellore Court లో చోరీ ఘటనపై మంత్రి kakani Govardhan Reddy స్పందించారు. జ్యూడిసీయల్ విచారణకు కూడా తాను సిద్దంగానే ఉన్నానని ప్రకటించారు.కోర్టులో చోరీ ఘటన వెనుక ఏవో దురుద్దేశాలున్నాయన్నారు.  ఈ విషయమై TDP  నేతలు కోర్టుకు వెళ్లవచ్చన్నారు.

2017లో తనపై మాజీ మంత్రి Somireddy Chandramohan Reddy  కేసు దాఖలు చేశారన్నారు. 2019 వరకు పోలీసులు చార్జీషీట్లు దాఖలు చేశారన్నారు. కానీ ప్రాథమిక ఆధారాలు లేనందున ఈ కేసును విచారణకు స్వీకరించలేమని కోర్టు అప్పట్లోనే చెప్పిందని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. Charge sheet ను మూడు సార్లు రిటర్న్ చేసిందన్నారు. 2019లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చార్జీషీట్ దాఖలైన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.ఈ కేసును అసలు తాను పట్టించుకోవడం లేదన్నారు. కోర్టులో చోరీని తానే చేయించి ఉంటే ఆధారాలను తాను అక్కడే వదిలివెళ్లేలా  చేస్తానా అని ప్రశ్నించారు. తాను మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత ఈ ఘటన జరగడం వెనుక తనకు కూడా అనుమానాలున్నాయన్నారు. తనకు మంత్రి పదవి రాదని కొందరు ప్రచారం చేశారని ఆయన చెప్పారు. 

నెల్లూరు జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలోని 4వ అదనపు కోర్టులో ఈ నెల 14న చోరీ జరిగింది.ఈ  చోరీలో పలు కేసులకు సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్లు చోరీకి గురయ్యాయి. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రెడ్డి వేసిన కేసుకు సంబంధించిన ఆధారాలు చోరీకి గురయ్యాయని  ప్రచారం సాగుతుంది. ఈ కేసుతో పాటు ఇతర కేసులకు సంబంధించిన ఆధారాలు కూడా చోరీకి గురి కావడం కలకలం రేపుతుంది.

మలేషియా, సింగపూర్, హాంగ్ కాంగ్ లలో సోమిరెడ్డికి ఆస్తులు ఉన్నాయని, పెద్దమొత్తంలో లావాదేవీలు జరిపారని కాకాని గతంలో ఆరోపణలు చేశారు. అంతేకాకుండా, ఇందుకు సంబంధించిన కొన్ని పత్రాలనూ ఇటీవల విడుదల చేశారు. ఆ పత్రాలను మీడియా ముందు కూడా ఉంచారు. అయితే ఆ పత్రాలన్నీ నకిలీవని, తనపై లేనిపోని అభాండాలు వేస్తున్నారని, ఈ నకిలీ పత్రాలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. 

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాని గోవర్ధన్ రెడ్డి విడుదల చేసిన పత్రాలు ఫోర్జరీవిగా పోలీసులు గుర్తించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి  తెచ్చిన డాక్యుమెంట్లు ఫోర్జరీవి అని తేలిందని ఫోరెన్సిక్ లేబోరేటరీ తేల్చింది. అసలు సోమిరెడ్డి మలేషియాకు వెళ్లలేదని ఇమ్మిగ్రేషన్ అధికారులు ధృవీకరించారు. ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసులో కొందరిని అరెస్టు కూడా చేశారు. ఈ మేరకు పలువురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు చార్జీషీట్ ను కూడా దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను కోర్టులో భద్రపర్చారు.  అయితే ఈ కోర్టులో చోరీకి పాల్పడిన ఇద్దరిని ఈ నెల 17న పోలీసులు అరెస్ట్ చేశారు. కుక్కలు వెంటపడడంతో దొంగలు కోర్టు తాళం పగులగొట్టి కోర్టులోకి వెళ్లారని ఎస్పీ వివరించారు. ఈ మేరకు సీసీటీవీ పుటేజీని కూడా మీడియా సమావేశంలో చూపారు.

Follow Us:
Download App:
  • android
  • ios