ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం ఎన్నో అవమానాలు, విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఎమ్మెల్యే పదవంటే అందరూ ఆషామాషీగా అనుకుంటున్నారని అసలు విషయం వేరే ఉందన్నారు. కానీ పనిచేసేవారికి అది ఒక గుదిబండ అంటూ అభిప్రాయపడ్డారు. 

అనంతపురం : నిత్యం వార్తల్లో ఉండే జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పదవంటే ముళ్ల కిరీటమని అభిప్రాయపడ్డారు. తనలాంటి నైజమున్నవారికి ఆ పదవి సరిపోదని చెప్పుకొచ్చారు. తాడిపత్రి నియోజకవర్గంలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఎమ్మెల్యే పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం ఎన్నో అవమానాలు, విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఎమ్మెల్యే పదవంటే అందరూ ఆషామాషీగా అనుకుంటున్నారని అసలు విషయం వేరే ఉందన్నారు. కానీ పనిచేసేవారికి అది ఒక గుదిబండ అంటూ అభిప్రాయపడ్డారు. 

పుట్టిన మనిషి ఏదోఒక మంచి కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో సుస్థిరస్థానం సంపాదించుకునేందుకు తపన పడాలని కోరారు. ఆ తపన కోసమే తన జీవితమంతా ధారపోసి ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నట్లు తెలిపారు. 

40 ఏళ్ల నుంచి తమ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న తాడిపత్రి ప్రాంత ప్రజలు తమ గుండెను గుడిగా పెట్టుకొని చూసుకుంటున్నారన్నారు. పెద్దవడుగూరు మండలాన్ని ఒక అద్దంలా తయారుచేయడమే తన లక్ష్యమన్నారు. 

మండల ప్రజలు వ్యక్తిగత అలంకరణపై ఉన్న శ్రద్ధను ఇంటి పరిసరాల పరిశుభ్రతపై పెట్టుకుంటే నందనవనంగా మారుతుందని హితవు పలికారు. మండలాభివృద్ధి కోసం ఎంత ఖర్చైనా చేస్తానని స్పష్టం చేశారు. 

కేవలం డబ్బుల వల్ల పనులు జరగవని, ప్రజల ఆద రాభిమానాల వల్లే ఏదైనా సాధ్యమవుతుందని చెప్పుకొచ్చారు. తాడిపత్రి పట్టణంలో దాదాపు 33 ఎకరాల్లో ఆధునిక సౌకర్యాలతో పార్కు ఏర్పాటుచేస్తున్నామన్నారు. 

జేసీ ప్రభాకర్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో పోటీ చెయ్యనని ప్రకటించారు. తన తరపున తన కుమారుడు జేసీ అశ్మిత్ రెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పదవిపై హాట్ హాట్ కామెంట్స్ చెయ్యడం రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది.