రాజమండ్రి:  రాష్ట్రంలో ప్రజలు గాలి వైసీపీకి అనుకూలంగా ఉందని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. అయితే ప్రజల వేవ్ ను తనకు అనుకూలంగా కూడ మార్చుకొనే సామర్థ్యం చంద్రబాబుకు ఉందని ఆయన చెప్పారు.

సోమవారం నాడు ఆయన  రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు.  రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ బలాన్ని ఇప్పటికిప్పుడే అంచనావేయలేమని ఆయన అభిప్రాయపడ్డారు.

వైసీపీ చీఫ్ జగన్ కు సరైన ఎన్నికల  బృందం లేదని ఉండవల్లి చెప్పారు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీ రాష్ట్రంలో విలీనం చేసిన సమయంలోనే ప్రత్యేక హోదా విషయమై బాబు పట్టుబట్టాల్సిన అవసరం ఉందని ఉండవల్లి చెప్పారు.

తాను రాజకీయాల్లోనే కొనసాగుతానని ఆయన చెప్పారు. కానీ, ఏ రాజకీయ పార్టీలో కూడ చేరనని ఆయన స్పష్టం చేశారు. తనకు టిడిపి, వైసీపీలో కూడ మిత్రులున్నారని ఆయన చెప్పారు.కడపలో స్టీల్ ప్లాంట్ కోసం దీక్షకు దిగబోతున్న ఎంపీ సీఎం రమేష్ తన మద్దతు కోరితే మద్దతిచ్చేందుకు తాను సిద్దంగా ఉన్నానని ఆయన చెప్పారు.