గుంటూరు: తాను  బీజేపీలో చేరడం లేదని టీడీపీలోనే కొనసాగుతానని టీడీపీ నేత డాక్టర్ అరవింద్ బాబు స్పష్టం చేశారు.

బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ  ఆదివారం నాడు డాక్టర్ అరవింద్ బాబును కలిశారు. అరవింద్ బాబు ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన ఎన్నికల్లో  నర్సరావుపేట నుండి  టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తనకు స్నేహితుడని అందుకే తనను కలిశాడని  అరవింద్ బాబు చెప్పారు. తనకు బీజేపీలో చేరే ఉద్దేశ్యం లేదన్నారు. తాను టీడీపీలోనే కొనసాగుతానని ప్రకటించారు. తాను పార్టీ మారుతాననే ప్రచారంలో వాస్తవం లేదన్నారు.

చంద్రబాబునాయుడు, లోకేష్‌లకు తాను మద్దతుగా నిలుస్తానని డాక్టర్ అరవింద్ బాబు స్పష్టం చేశారు.  ఏపీ రాష్ట్రంలో టీడీపీ నేతలపై బీజేపీ కన్నేసింది. టీడీపీ నేతలను  తమ పార్టీలో చేర్చుకొనేందుకు కమల దళం ప్రయత్నాలు చేస్తోంది.  మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి టీడీపీ నేతలతో టచ్ లోకి వెళ్లినట్టుగా ప్రచారం సాగుతోంది.

ఇప్పటికే కొందరు టీడీపీ నేతలు బీజేపీలో చేరారు. మరికొందరు కూడ ఇదే బాటలో పయనించనున్నారని ప్రచారం సాగుతోంది.